నవతెలంగాణ – కాటారం
కాటారం డివిజన్లో ఉన్న అటవీ, రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. శుక్రవారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ, అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో కలిసి మండల వారీగా భూ సమస్యలు, బుల్క్ భూ వివాదాలపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భూ వివాదాల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమని తెలిపారు. అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దుల నిర్ధారణలో స్పష్టత తీసుకురావడానికి సంయుక్త సర్వే కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా సమస్యలను పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు.
ఇక భూ సంబంధిత పెండింగ్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి కేసును పారదర్శకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎఫ్డిఓ సంపత్, కాటారం డివిజన్ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.



