అబద్దాల పాలనలో మోడీ సర్కారే నెంబర్‌వన్ అని మరోసారి నిరూపించుకుంది. కేంద్రం ఆధీనంలోని నిటి ఆయోగ్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం రైతుల జీవితాలను పరిహాసం చేసింది. వారి ఆదాయం నూట ఇరవై ఆరు శాతం పెరిగిందంటూ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ దశాబ్దకాలంగా చరిత్రలో ఎన్నడూ లేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్టు వెల్లడించింది. చైనా వృద్ధిని దాటేసినట్టు, పంటల కంటే చేపల సాగులో మరింత పురోగతి సాధించినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు, 2015-16 నుంచి 2024-25 వరకు ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని అంతరాల దొంతరలను కప్పిపుచ్చింది, అబద్దాలను వండివార్చింది. ఈ నివేదిక రైతుల ఆత్మహత్యలు, అప్పులు, ఆందోళనలు లెక్కలోకి తీసుకోలేదు. అంతా తప్పుడు లెక్కల్ని ఆ’నీతి’ పత్రం వెల్లడించింది. అయితే, తాజాగా విబిజి రామ్ జి-చట్టం, సీడ్ బిల్, విద్యుత్ బిల్, విపత్తు నిర్వహణ చట్టానికి సవరణల వంటి అంశాలు దేశంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పోరాటాలూ ఉపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే నీతి ఆయోగ్‌ను అడ్డం పెట్టుకుని కేంద్రం ఆడుతున్న నాటకమిది! ఇక్కడ గమనించాల్సింది 2026 బడ్జెట్ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేయడం. అంటే, వ్యవసాయాన్ని చరిత్రాత్మక వృద్ధిగా అభివర్ణించడం ద్వారా రైతాంగ వ్యవస్థ చాలా బాగుందని, వారికి ఎలాంటి సమస్యలు లేవని చూపించే రాజకీయ కుట్ర కోణమిది. నీతి ఆయోగ్ నివేదిక చిన్న, సన్నకారు రైతుల గురించి పట్టించుకోనే లేదు. కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారాలు, భూస్వాముల ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ఈ మొత్తం లెక్కలను వారి ఆదాయంతో కలిపేసింది. దీంతో కొద్దిమంది సంపన్న రైతుల విజయాన్ని మొత్తం రైతుల వృద్ధిలాగా చూపించింది. రైతుల నిజమైన నికర ఆదాయాన్ని అంచనా వేయడంలో అప్పులు, రుణ చెల్లింపులు పరిగణలోకి తీసుకోకపోవడం పెద్దమోసం. ఒకవైపు ఈ దశాబ్దకాలంగా 1.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేస్తోంది.
రైతుల ఆదాయం పెరిగి ఉంటే ఈ ఆత్మహత్యలు జరిగేదా? మరోవైపు రైతులకు సబ్సిడీలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా అవి సబ్సిడీలు, విత్తనాలు, ఎరువుల ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. ఈ లెక్కలన్నీ క్షేత్రస్థాయి గణాంకాలను అస్సలు సరిపోలడం లేదు. రైతుల ఆదాయం భారీగా పెరిగిందన్న వాదన వాస్తవ విరుద్ధం. దీనివల్ల లాభాలు నిజంగా భూమిని సాగుచేసే రైతులకు కాకుండా, పెట్టుబడిదారులు, పెద్ద భూస్వాములకే పరిమితమయ్యాయని స్పష్టం. ప్రధాన పంటలైన వరి వంటి వాటిల్లో మిగులు ఆదాయం ఎక్కువగా ఉంటుందని, రైతులకు లాభమని చెబుతున్నా, ధరలు పడిపోవడం, సమగ్ర కొనుగోలు వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలను మాత్రం నిటిఆయోగ్ లెక్కలోకి తీసుకున్న పాపాన పోలేదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) నుంచి రూ.67వేల కోట్లను మినహాయించడం వల్ల క్రమంగా కొనుగోలు వ్యవస్థను దెబ్బతీసే కుట్ర చాపకింద నీరులా సాగుతోంది.
దీన్ని రైతులు పసికట్టాల్సిన అవసరం ఉంది. ఇకపోతే, ప్రకృతి కలిగించే నష్టాలు. అకాల వర్షాలు, వరదలు, కరువులు, కార్చిచ్చులు, బీమాలేని పంట నష్టాల వల్ల ఇప్పటికే రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను ఈ నివేదిక పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో యాభై నుంచి డెబ్బయి శాతం పంటలు నష్టపోయాయి. అయినా కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ చట్టం- 2025ను సవరించి, నష్టపరిహారాన్ని తగ్గించి ఇచ్చింది. కానీ, ఈ నివేదిక ఈ విషయాలేవీ ప్రస్తావించలేదు. అప్పులు తీర్చలేక భూములు కోల్పోవడం, మౌలిక సదుపాయాల పేరుతో భూముల స్వాధీనం వంటి విషయాలనూ దాటవేసింది. అప్పులు చెల్లించిన తర్వాత రైతు చేతిలో మిగిలే నికర ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోలేదు.
ఎక్కువమంది చిన్న రైతులు ఇప్పటికీ అధిక వడ్డీకి ప్రయివేటు సంస్థలు ఇచ్చే రుణాలపైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వ సంస్థల ద్వారా రుణాలిస్తున్నా మని చెప్పుకున్నా, నిజంగా అవసరమైన పేద రైతులకు తక్కువ వడ్డీకి అందుతున్న దాఖలాలు లేవు. నిటి ఆయోగ్ అధ్యయనం ప్రభుత్వతీరుకు అనుగుణంగా మారిందే తప్ప… రైతుల కష్టాన్ని ప్రతిబింబించలేదు. వీరికి నష్టం కలిగించిన విధానాలనూ విమర్శించలేదు. ప్రభుత్వ పథకాలను పొగుడుతూ ఎరువుల సబ్సిడీల్లో కోతలు, గ్రామీణ ఉపాధి హామీకి బదులుగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథక వివాదాస్పద మార్పులను ఈ నివేదిక పట్టించుకోనేలేదు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలను అభద్రతలోకి నెట్టేసే చర్యలు. ఇది శాస్త్రీయ పరిశీలన ఏమాత్రం కాదు, ఒక రాజకీయ కరపత్రం. గణాంకాలను చూపిస్తూ అంతా బాగుందని చెప్పడం, రైతుల కన్నీళ్లను, కష్టాలను వారి జీవితాలను అవమానించడమే. మొత్తమ్మీద ఈ నివేదిక ఒక ”జుమ్లా చిట్టా” మాత్రమే.
‘జుమ్లా’ నివేదిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



