Saturday, October 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజర్నలిజం అంటే గ్లామర్‌ మాత్రమే కాదు

జర్నలిజం అంటే గ్లామర్‌ మాత్రమే కాదు

- Advertisement -

వాస్తవాలు చెప్పే ధైర్యముండాలి..ప్రజలకు అర్థమయ్యే భాషను వాడాలి
అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలి
పాలకుల విధానాలపై సమాజంలో అవగాహన పెంచాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘గాజాలో సుమారు 241 మంది జర్నలిస్టులు మరణించారు. అల్‌ జజీర న్యూస్‌ నెట్‌వర్క్‌కు చెందిన జర్నలిస్టులపై దాడి చేసి చంపారు. వారిని చంపితే గాజాలో ప్రజల బాధలు, వాస్తవాలు ప్రపంచానికి తెలియకుండా చేయొచ్చని ఇజ్రాయిల్‌ కుట్ర పన్నింది. అయినా గాజాలో ధైర్యంగా పనిచేసిన జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. జర్నలిజం అంటే మీడియాలో గ్లామర్‌గా కనిపించడం మాత్రమే కాదు. అలా ఉందనుకోవడం పొరపాటు. గ్లామర్‌ కంటే వాస్తవ విషయాలను ప్రజలకు చెప్పే ధైర్యముండాలి. నవతెలంగాణ విలేకర్లు గ్లామర్‌ కంటే విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు’అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ ఆరుణ్‌కుమార్‌ అన్నారు. నవతెలంగాణ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ గాజా మీద ఇజ్రాయిల్‌ యుద్ధంపై మీడియా తగిన రీతిలో స్పందించలేదనీ, కొత్త వ్యక్తులు, శక్తులను భాగస్వాములను చేయలేకపోయిందని అన్నారు. పాలస్తీనా దేశ విముక్తి కోసం, ఇజ్రాయిల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చిత్రీకరించలేకపోయామని చెప్పారు.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంగానే ప్రచారం సాగిందన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా యూదులు చేసిన యుద్ధంగానే చిత్రీకరించిందని అన్నారు. పాలస్తీనాకు మద్దతిస్తే ముస్లింలకు అనుకూలంగా, హిందువులకు వ్యతిరేకంగా అవుతుందనీ, అది కూడా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్టుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు భావించాయని చెప్పారు. అందుకే ఇజ్రాయిల్‌కు మద్దతు ఇచ్చాయని వివరించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మత విద్వేషాలు పెంచడంలో బీజేపీ విజయవంతమైందని అన్నారు. వియత్నాం మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి చేసినపుడు దానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయనీ, ఆ సమయంలో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఎంతో మంది ఆకర్షితులయ్యారని చెప్పారు. ఇప్పుడు పాలస్తీనాపై అమెరికా సామ్రాజ్యవాదం మద్దతుతో ఇజ్రాయిల్‌ యుద్ధం చేస్తే దాని ప్రభావం ఎక్కువ మందిలోకి వెళ్లలేదన్నారు. మీడియా సత్యానికి కట్టుబడి ప్రజల పక్షం వహించాలనీ, ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణగా సరళమైన భాషను మీడియా వాడాలని సూచించారు.

తెలంగాణ పల్లెల్లో ఉన్న ప్రజల కష్టాల గురించి రాస్తూనే ఆదిలాబాద్‌, కరీంనగర్‌ నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వారు అక్కడ పడుతున్న బాధలు, ఇక్కడ వారి కుటుంబాల ఇబ్బందుల గురించి మానవీయ కోణంలో కథనాలను రాయాలని కోరారు. అభ్యుదయ, ప్రజాతంత్ర భావాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఆధిపత్యానికి, దురహంకారానికి వ్యతిరేకంగా నిలబడాలనీ, మానవత్వాన్ని నిలబెట్టాలని కోరారు. దేశంలో ఖనిజాలు, సహజ వనరులను అదానీ, అంబానీకి కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. ఛత్తీస్‌ఘడ్‌లో ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులపై దాడులు చేసి అక్కడున్న ఖనిజాలను, ఆ భూములను కార్పొరేట్‌ సంస్థలకు ఇవ్వాలని చూస్తున్నదని అన్నారు. అస్సాంలో 1,500 ఎకరాల భూమిలో ముస్లింలు ఉంటే, వారిని ఖాళీ చేయించి ఆ భూమిని కార్పొరేట్లకు ఇచ్చేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్‌, మతోన్మాద అనుకూల విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ క్రోనీ క్యాపిటలిజానికి (ఆశ్రిత పెట్టుబడి) పాల్పడుతున్నదని చెప్పారు.

ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో పాలకుల విధానాలు, రాజకీయ పరిణామాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో మీడియా అందించాలని సూచించారు. ఇప్పుడు యువత రాజకీయాలు, సమాజం గురించి ఆలోచించడం లేదనీ, స్వార్థం, వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని అనుకోవద్దని అన్నారు. అమెరికాలో 1940లో సోషలిజానికి 16 శాతం మంది అనుకూలంగా ఉంటే 2022లో 48 శాతానికి పెరిగిందని వివరించారు. 22 నుంచి 30 ఏండ్ల వయస్సున వారు పెట్టుబడిదారీ విధానం కన్నా సోషలిజం మంచిదంటున్నారని చెప్పారు. నేపాల్‌లో, శ్రీలంకలో యువత పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చిందని గుర్తు చేశారు. ఇంకోవైపు చైనా మీద దుష్ప్రచారం జరుగుతున్నదని వివరించారు. అక్కడ ఆర్థిక వృద్ధి కన్నా ఆర్థికాభివృద్ధి జరుగుతున్నని చెప్పారు. ఉదారవాద విధానాలను అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా అభివృద్ధి జరుగుతున్నదని వివరించారు. భారత్‌లో జీడీపీ పెరిగినా ఉద్యోగ రహిత అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. ఉదారవాద విధానాలకు, చైనా ఆర్థిక విధానాలకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. సమాజంలో ఉన్న పరిణామాలను, రాజకీయాలను గమనించి ప్రజల్లో చైతన్యం పెంపొందించేలా వారికి అర్థమయ్యే భాషలో మీడియాలో కథనాలుం డాలని సూచించారు. నవతెలంగాణ సంపా దకులు రాంపల్లి రమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజీఎం పి ప్రభాకర్‌, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ సంపాదకులు కె ఆనందాచారి, మొఫషీల్‌ ఇన్‌చార్జీ వేణుమాధవ్‌, జనరల్‌ మేనేజర్లు వెంకటేశ్‌, భరత్‌, రఘు, ఆర్‌ వాసు, శశిధర్‌, నరేందర్‌రెడ్డి, పవన్‌, ఉపేందర్‌రెడ్డితోపాటు ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు బసవపున్నయ్య, బివిఎన్‌ పద్మరాజు, మోహన్‌కృష్ణ, అజయ్ కుమార్‌, ఎస్‌కే సలీమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -