Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయంమేడే స్పూర్తితో జర్నలిస్ట్‌లసమస్యలపై సంఘటిత పోరాటం

మేడే స్పూర్తితో జర్నలిస్ట్‌లసమస్యలపై సంఘటిత పోరాటం

– సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంఎస్‌ హష్మీ
– పోరాటాల ఫలితమే మే డే: బసవపున్నయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌

మేడే స్పూర్తితో జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్‌, ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఎస్‌ హష్మీ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల జర్నలిస్ట్‌ లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (హెచ్‌ యూజే), తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) ఆధ్వర్యంలో శుక్రవారం మేడే కార్యక్రమం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించారు. ఈ సందర్బంగా హష్మీ మాట్లాడుతూ జర్నలిస్ట్‌లపై ప్రభుత్వాలకు చిన్నచూపు ఉన్నదన్నారు. సకాలంలో అక్రిడిటేషన్‌ కార్డులు కూడా పొందలేని పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌ లు సంఘటితంగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తు చేశారు. టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ 8 గంటల పనివిధానం, కనీస వేతనాల అమలు కోసం కార్మికులు చేసిన పోరాట ఫలితమే మేడే అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మారుస్తున్నదని చెప్పారు. జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌ సర్కారు తక్షణం అమలు చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఈ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలు పొందడం లేదన్నారు. మేడే సందర్బంగా కార్మికులకు సాధారణ సెలవు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. హెచ్‌యూజే కార్యదర్శి బి జగదీశ్వర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌ కే సలీమా, కే నిరంజన్‌, బి దామోదర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ మధుకర్‌, పి విజయ, హెచ్‌యూజే ఉపాధ్యక్షులు జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img