- Advertisement -
- – దుర్భాషలాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన
- – క్షమాపణ చెప్పాలని జర్నలిస్టుల డిమాండ్
- నవతెలంగాణ-భూపాలపల్లి
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విలేకరులనుద్దేశించి దుర్భాషలాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విలేకరుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జర్నలిస్టులందరు ఏకమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని తగు నిర్ణయాలను ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరిగిన మంత్రుల పర్యటన కార్యక్రమాలను ముకుమ్మడిగా బహిష్కరించారు. ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, ర్యాలీ నిర్వహించారు.
- అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, ధర్నా సందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలు చేరుకొని విలేకరు లకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మంతెన సమ్మయ్య, క్యాతం సతీష్, సామంతుల శ్యాం, రవి భాస్కర్, ఎడ్ల సంతోష్, సామల శ్రీనివాస్, జల్ది రమేష్, ఎర్రం సతీష్ కుమార్, తడక సుధాకర్, చెరుకు సుధాకర్, బెల్లం తిరుపతి, గట్టు రవీందర్, దొమ్మాటి రవీందర్, శేఖర్ నాని, తిక్క ప్రవీణ్, సర్వేశ్వరరావు తో పాటు సుమారు 80 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జర్నలిస్టుల నిరసనకు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్, నాయకులు మహర్షి, చిరంజీవి, నాగరాజు, అరవింద్ తోపాటు వివిధ సంఘాలు మద్ధతు తెలిపాయి.
- Advertisement -