సర్కారు జీవో జారీ
మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో 252ను జారీ చేసింది. ఈమేరకు కొత్త నిబంధనలను రూపొందించింది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేండ్లుగా ప్రభుత్వం నిర్ణయంచింది. ఇప్పుడు ఏర్పాటయ్యే కమిటీలే మళ్లీ కొత్తవి వచ్చే వరకు కొనసాగుతాయి. తాజా జీవోలో అక్రిడిటేషన్లను రెండుగా వర్గీకరించారు. ఫీల్డ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు కార్డులు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు అందజేశారు. ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డు ఇవ్వనున్నట్టు కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే మీడియా కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందేందుకు ఉపయోగించు కోవచ్చని జీవోలో తెలియజేశారు. ఇదిలా ఉండగా డిజిటల్ మీడియాకు తొలిసారిగా అక్రిడిటేషన్ నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది.
డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో నెలకు కనీసం 5 లక్షల మంది యూనిక్ విజిటర్లు ఉండాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారని జీవోలో తెలియజేశారు. ఇదిలావుండగా ఆయా పత్రికలకు అర్హతలను ప్రభుత్వం నిర్ణయించింది. పత్రికలకు సంబంధించి కనీసం 2,000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రెడిటేషన్‌కు అర్హులు. పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి శాటిలైట్ ఛానళ్లు 50 శాతం వార్తా కంటెంట్‌ను కలిగి ఉండాలనీ, లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం మూడు బులెటిన్లు టెలికాస్ట్ చేయాలని నిబంధనల్లో పొందుపరిచారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. నియోజకవర్గ, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా నిర్ణయించింది.
15 ఏండ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏండ్ల అనుభవంతో పాటు 58 ఏండ్లు నిండిన వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని నిబంధనల్లో పేర్కొన్నారు. అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు మీడియా అకాడమీ చైర్మెన్ రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీకి చైర్మెన్‌గా, సమాచారా శాఖ కమిషనర్ లేదా స్పెషల్ కమిషనర్ కో-చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్లకు చెందిన ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ప్రతినిధులుగా ఉంటారని మార్గదర్శకాలు వివరించారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని నిబందనల్లో పేర్కొన్నారు. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుందని జీవోలో తెలిపారు.
జర్నలిస్టులకు త్వరలో కొత్త అక్రిడిటేషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



