Sunday, January 18, 2026
E-PAPER
Homeప్రత్యేకంఉల్లాసం, ఉత్సాహం, సృజనాత్మకత… పిల్లలమర్రి బాలోత్సవం

ఉల్లాసం, ఉత్సాహం, సృజనాత్మకత… పిల్లలమర్రి బాలోత్సవం

- Advertisement -

జనవరి 5,6 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో పిల్లలమర్రి బాలోత్సవం, నాలుగవ పిల్లల జాతర అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. విద్యార్థులలో మానసికోల్లాసం, సాంస్కృతికాభిలాష, సృజనాత్మకత, సమానత్వ భావనలు పెంపొందించడమే లక్ష్యాలుగా గత నాలుగేళ్లుగా పిల్లలమర్రి బాలోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రముఖ న్యాయవాది బెక్కెం జనార్ధన్‌ అధ్యక్షులుగా, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ పి.ప్రతిభ ప్రధాన కార్యదర్శిగా, వీరాంజనేయులు కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఆర్‌ ప్రమోద్‌ కోశాధికారిగా ఏర్పడిన బాలోత్సవ సొసైటీ, ప్రతి యేటా బాలోత్సవాలు నిర్వహించడానికి పట్టుదలగా కృషి చేస్తూ వస్తున్నది. మొట్టమొదటిసారిగా డిసెంబర్‌ 22లో పిల్లలమర్రి బాలోత్సవం విజయవంతమైంది. ఆ తర్వాత 2023, 2024లలో వరుసగా బాలోత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం, అమరావతి బాలోత్సవాలను స్ఫూర్తిగా తీసుకున్న పిల్లలమర్రి బాలోత్సవ సొసైటీ, తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా మహబూబ్‌నగర్‌లోని బృందావన్‌ గార్డెన్స్‌లో 44 రకాల ఈవెంట్లతో దాదాపు ఏడు వేల మంది విద్యార్థులతో విజయవంతంగా బాలోత్సవం నిర్వహించింది.

రెండుమూడేళ్లలో జరిగిన బాలోత్సవాలు, పిల్లలను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకర్షించాయి. సెప్టెంబర్‌ నెల వచ్చిందంటే చాలు… బాలోత్సవాలు నిర్వహించే తేదీల కోసం, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలు కూడా ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. 2025లో డిసెంబర్‌ 19,20 తేదీలలో నిర్వహించడానికి బాలోత్సవ కమిటీ, ప్రణాళికలు రూపొందించి, రెండు నెలల ముందు నుండి అంటే అక్టోబర్‌ నెల నుండే ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే డిసెంబర్‌ నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో అనివార్యంగా తేదీలను పొడిగించవలసి వచ్చింది.

బాలోత్సవ విధానం
సాంస్కృతిక, విద్యాపరమైన అంశాలుగా బాలోత్సవం నిర్వహించబడుతున్నది. జానపద, శాస్త్రీయ నృత్యాలు, బతుకమ్మ, కోలాటం, మట్టితో బొమ్మలు, చిత్రలేఖనం, దేశభక్తి గేయాల ఆలాపన, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణ సాంస్కృతిక విభాగం కింద నిర్వహిస్తున్నారు. అలాగే కథా రచన, కవితా రచన, ఉపన్యాసం (తెలుగు, ఇంగ్లీష్‌), వ్యాసరచన (తెలుగు,ఇంగ్లీష్‌), మ్యాప్‌ పాయింటింగ్‌, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, స్పెల్‌-బి, క్విజ్‌ విద్యా విభాగంలో చేపడుతున్నారు. బతుకమ్మ, కోలాటం, కవిత రచన మాత్రమే సీనియర్‌ విభాగంలో నిర్వహించగా మిగిలిన అన్ని ఈవెంట్లు జూనియర్లు, సీనియర్లకు నిర్వహించారు. వీటికి కొసమెరుపుగా ఎల్‌కేజీ, యూకేజీ చిన్నారులకు ప్రత్యేకంగా ఫ్యాన్సీ పేరేడ్‌ నిర్వహించబడింది. ఫ్యాన్సీ పెరేడ్‌లో పాల్గొన్న చిన్నారులకు అందరికీ పథకాలు అందజేయడంతో పాటు ప్రతి ఈవెంట్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయబడ్డాయి. అంతేకాకుండా పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రంతో పాటు పాఠశాలకు కూడా జ్ఞాపికను బహుకరించారు.

నిబంధనలు, నిర్ణేతలు
బాలోత్సవాల్లో పాల్గొనే ప్రతి విద్యార్థి తను చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపల్‌ ద్వారానే ప్రవేశం పొందవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా కానీ, ఇతర సంస్థల ద్వారా గాని ప్రవేశం పొందే అవకాశం లేదు. ప్రభుత్వ, ప్రయివేటు, గురుకులాలు మొదలగు అన్ని విద్యాసంస్థల నుండి విద్యార్థులు పాల్గొనవచ్చు. బాలోత్సవాలలో పాల్గొనుటకై విద్యార్థి గాని, పాఠశాల గాని ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు, పూర్తిగా ఉచితం.గత మూడు బాలోత్సవాలలో ప్రింట్‌ చేయబడిన ఎనిమిది పేజీల దరఖాస్తును కమిటీ సరఫరా చేసింది. అయితే ఈసారి మాత్రం ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా గూగుల్‌ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. జానపదం, కోలాటం, దేశ భక్తి గేయాలు లాంటి గ్రూపు ఈవెంట్‌లలో ఇరవైమంది వరకు పాల్గొనవచ్చు.

కథారచన, కవితా రచన, మట్టితో బొమ్మలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాసం లాంటి విభాగాలలోని అంశాలను అప్పటికప్పుడే ప్రకటించడం ద్వారా విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ ఏడాది 34 విభాగాలలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ విభాగాలన్నింటికీ మొత్తం ఇరవై మూడు మంది ఆయా విభాగాలలో నైపుణ్యం ప్రముఖులు, డాన్స్‌ మాస్టర్లు న్యాయ నిర్ణ్ణేతలుగా సమర్థవంతంగా వ్యవహరించారు. స్వాభిమానాలకు, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించేందుకు గాను, విద్యార్థులతో, ఎలాంటి అనుబంధ సంబంధాలు లేని వారినే బాలోత్సవ కమిటీ జడ్జీలుగా నియమించింది. ఇందులో భాగంగానే ప్రతి పాఠశాలకు ప్రతి విద్యార్థికి కోడ్స్‌ నిర్ణయించబడ్డాయి. పాల్గొంటున్న విద్యార్థులు ఏ పాఠశాలకు చెందినవారు ఎలాంటి పరిస్థితిలోనూ న్యాయ నిర్ణేతలకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొనబడ్డాయి.

విద్యార్థుల నైపుణ్యానికి తోడ్పాటు
రెండు రోజులలో దాదాపు 7500 మందికి పైగా విద్యార్థులు, దాదాపు మూడువందల మంది ఉపాధ్యాయులు మరో ఐదు వందల మందికి పైగా తల్లిదండ్రులు, బస్సు డ్రైవర్లు, వీక్షకుల కోసం బాలోత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. మట్టితో బొమ్మలు చేసేవారికి శుద్ధి చేసిన మట్టితో పాటు, అట్టలు, కటోరాలలో నీరు, చిత్రలేఖనం కోసం డ్రాయింగ్‌ షీట్లు, వ్యాసరచన కోసం తెల్ల కాగితాలు, నృత్యపోటీలలో పాల్గొన్న విద్యార్థులకు గ్రీన్‌ రూములు కూడా కమిటీ ఏర్పాటు చేసింది. బాలోత్సవాలలో పాల్గొంటున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకే కాక బస్సు డ్రైవర్లకు, తల్లిదండ్రులకు మంచి రుచికరమైన భోజన సదుపాయాన్ని బాలోత్సవ కమిటీ ఉచితంగా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా బాలోత్సవాలను సందర్శించడానికి జిల్లాలోని అనేక పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులకు కూడా ఉచిత భోజన సదుపాయం కల్పించబడింది.

మొత్తం నాలుగు బాలోత్సవాలు విజయవంతమయ్యాయి. విద్యార్థులను నైపుణ్యం ప్రతి బాలోత్సవానికి మెరుగు పడుతూ వస్తోందని, ఈసారి బాలోత్సవాలలో మరింత నాణ్యత మెరుగుపడిందని, పోటీతత్వం, పాల్గొనాలన్న ఉత్సాహం ప్రతిసారి పెరుగుతున్నాయని, న్యాయ నిర్ణేతలు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు పేర్కొనటం మంచి విషయం.బాలోత్సవాల్లో పాల్గొన్న అనుభవంతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొంటున్నారని, విజేతలుగా నిలుస్తున్నారని, బాలోత్సవాల ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నారని పలువురు ఉపాధ్యాయులు చెప్పడం బాలోత్సవ కమిటీకి బాధ్యతను రెట్టింపు చేసింది.

ప్రముఖుల సహకారం
పట్టణంలోని ప్రముఖులు, ప్రభుత్వ యంత్రాంగం పిల్లలమర్రి బాలోత్సవాలకు ఇతోదికంగా సహకరిస్తున్నాయి. పట్టణంలోని డాక్టర్లు, లాయర్లు, వాణిజ్యవేత్తలు బాలోత్సవాల నిర్వహణకు ఆర్థిక సహాయ సహకారాలు అందచేస్తున్నారు. ఈసారి సీనియర్స్‌ సిటిజన్స్‌ ఫోరం, టాప్రా సభ్యులు కూడా నిర్వహణలో పాలుపంచుకున్నారు. పదిమంది ఆర్గనైజర్లు,అరవై మంది విద్యార్థి వాలంటీర్లు కూడా బాలోత్సవాలు సజావుగా సాగడానికి కృషి చేశారు.

పట్టణంలోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ మహేష్‌ బాబు గత నాలుగేండ్లుగా విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను సమర్పిస్తూ విద్యార్థులపై తమ ప్రేమాభిమానాలను చాటుకుంటున్నారు. జనవరి 6న జరిగిన ముగింపు సభకు పాలమూరు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ జి శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని బాలోత్సవాలను అభినందించారు. ఇలాంటి బాలోత్సవాలు విద్యార్థుల జీవన గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. పిల్లలమర్రి బాలోత్సవ కమిటీ రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు విస్తరించడానికి ఈ బాలోత్సవాలు ప్రేరణ కలిగించాయంటే అతిశయోక్తి లేదు.

వీరాంజనేయులు, 9490909780

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -