Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడ్డీ రాయితీ మంజూరు పట్ల హర్షం

వడ్డీ రాయితీ మంజూరు పట్ల హర్షం

- Advertisement -

– సునీల్ రెడ్డి ని కలిసిన కమ్మర్ పల్లి మహిళలు, ఐకెపి సిబ్బంది
నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ డబ్బులను మంజూరు చేసిన సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిని కమ్మర్ పల్లి ఐకెపి మహిళలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శనివారం ప్రజా నిలయంలో సునీల్ రెడ్డి ని కలిసి ఇందిరా జీవిత బీమా పరిహారం అందజేసినందుకు ఐకెపి మహిళలు, సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలిపే శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజానీలయానికి విచ్చేసిన మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఇందిరా బీమా లబ్ధిదారులు ఐకెపి సిబ్బందిని ఉద్దేశించి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరెన్ని సంక్షేమ పథకాలను మహిళలకు అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ, ఇందిరా ప్రమాద బీమా, రుణ బీమా, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఇందిరా మహిళా శక్తికి క్యాంటీన్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు.అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తోపాటు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిని అందజేయడం, ఉచిత బస్సు సౌకర్యం, గృహలక్ష్మి కింద ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం మహిళల పేరు ఎత్తడానికి సైతం వెనకాడిందని, కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏకంగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేపడుతోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కమ్మర్ పల్లి ఏపిఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మహిళా సంఘాలకు బీమా సౌకర్యం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదిలక్షల ప్రమాద బీమా, రెండు లక్షల వరకు రుణ బీమా సౌకర్యం కల్పించిందన్నారు. ఇందులో భాగంగా కమ్మర్ పల్లి మండలంలో మరణించిన ముగ్గురు మహిళల కుటుంబీకులకు 10 లక్షల చొప్పున 30 లక్షల పరిహారం ఖాతాలో జమ కావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మరో ఆరుగురు మహిళల కుటుంబీకుల యొక్క ఖాతాలలో రుణబీమాకు సంబంధించిన డబ్బు జమ కావడం జరిగిందన్నారు.

  కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కమల, కార్యదర్శి వాసవి, కోశాధికారి రోజా రాణి, సీసీలు పీరియా, భాగ్యలక్ష్మి, అలేఖ్య, వివోఏలు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -