Monday, November 10, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజూబ్లీ బైపోల్‌లో ముగిసిన ప్రచారం

జూబ్లీ బైపోల్‌లో ముగిసిన ప్రచారం

- Advertisement -

మూగబోయిన మైకుల మోత, ప్రచార సందడి
అమల్లోకి ఎన్నికల ఆంక్షలు…రేపే పోలింగ్‌
సంక్షేమ పథకాలు, అభివృద్ధే నినాదంగా ప్రజల్లోకి కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ వైఫల్యాలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రచారం
రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లతో హౌరెత్తించిన పార్టీలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల హౌరాహౌరీ ప్రచారానికి ఆదివారం సాయంత్రం 6 గంటలతో తెరపడింది. దాంతో పార్టీల ప్రచార వాహనాల సందడి, నాయకుల ప్రసంగాలు, కార్యకర్తల నినాదాలతో మార్మోగిన వీధులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. ర్యాలీలు, రోడ్‌ షోలు, కార్నర్‌ మీటంగ్‌ల హడావుడి ముగిసింది. గడిచిన ఇరవై రోజులుగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల్లో అన్ని పార్టీల ముఖ్య నేతలు వివిధ రూపాల్లో తమ ఎన్నికల ప్రచారంతో హౌరెత్తించాయి. ఇక ప్రచారానికి తెరపడటంతో ఎన్నికల ఆంక్షలు అమల్లోకి రాగా.. ఇక అందరి దృష్టి రేపటి పోలింగ్‌పైనే నిలిచింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనుండగా, అభ్యర్థుల భవితవ్యం ఈనెల 14న వెలువడనున్న ఓట్ల లెక్కింపుతో తేలనుంది.

అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ.. చివరి రోజు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని నినాదంగా చేసుకుని ఓటర్లను అభ్యర్థించింది. ముఖ్యంగా డివిజన్‌ల వారీగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, జూపల్లితో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మెన్లు ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, స్థానిక నాయకులు, అభ్యర్థి నవీన్‌ యాదవ్‌తో కలిసి రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో ప్రచారాన్ని హౌరెత్తించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటానని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించింది.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు.. తమ ప్రసంగాల్లో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొని, పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనతో రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. హరీశ్‌ రావు తండ్రి మరణించినప్పటికీ.. ప్రచార బాధ్యతల్లో కేటీఆర్‌కు అండగా నిలిచారు. బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగించింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను విమర్శిస్తూ ప్రచారం చేసింది. ఇందులో భాగంగా బైక్‌ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో పాటు పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజరు, ఇతర సీనియర్‌ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నిక ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం సాధారణ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఇప్పుడు అందరి చూపు ఓటరు నాడీపైనే నిలిచింది. రేపు పోలింగ్‌ కేంద్రా లకు తరలివచ్చి తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

సర్వేల గందరగోళం
వివిధ సంస్థలు విడుదల చేసిన ఒపీనియన్‌ పోల్స్‌ మిశ్రమ ఫలితాలను వెల్లడిస్తూ రాజకీయ గందరగోళాన్ని మరింత పెంచాయి. సైదులు సర్వే, ”మూడ్‌ ఫర్‌ ది పబ్లిక్‌ అండ్‌ పీపుల్‌” సర్వే, లోక్‌ పోల్‌ సర్వే వంటివి కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పాయి. నవీన్‌ యాదవ్‌ తన సామాజిక సేవతో 50.65శాతం ఓట్లు సాధించవచ్చని ఒక సర్వే అంచనా వేసింది. మరోవైపు చాణక్య, కేకే, శాస్‌ వంటి సర్వేలు బీఆర్‌ఎస్‌ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి. ముఖ్యంగా కేకే సర్వే బీఆర్‌ఎస్‌కు 55శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 37శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

పార్టీలకు ప్రతిష్టాత్మకం..
ఈ ఉపఎన్నిక ఫలితం అధికార, ప్రతిపక్షాలకు రాజకీయంగా కీలకంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు ఈ ఎన్నికను ఒక రెఫరెండంగా భావిస్తున్నారు. గెలుపు ద్వారా హైదరాబాద్‌లో పార్టీ పట్టును నిరూపించుకోవాలని, తన నాయకత్వాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన భావిస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు అత్యంత అవసరం. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను తాము నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. భిన్నమైన సర్వేలు, పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు తర్వాతే స్పష్టమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -