Friday, November 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునేడే జూబ్లీహిల్స్‌ తీర్పు

నేడే జూబ్లీహిల్స్‌ తీర్పు

- Advertisement -

10 రౌండ్లలో కౌంటింగ్‌
మధ్యాహ్నానికి ఫలితాలు
సర్వత్రా ఉత్కంఠ

నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ దృష్టిని ఆకర్షించిన జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకానుండగా, మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పుతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉంది.

లెక్కింపునకు అంతా సిద్ధం
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉదయం 8:45 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి144 సెక్షన్‌ను విధించారు.

గెలుపుపై ఎవరికి వారే ధీమా
సిట్టింగ్‌ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థి నవీన్‌ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంటామని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గట్టి పట్టుదలతో ఉన్నారు. బీజేపీ తరపున దీపక్‌ రెడ్డి పోటీలో నిలిచారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం ఓటింగ్‌ నమోదైన విషయం తెలిసిందే.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు
పోలింగ్‌ ముగిసిన అనంతరం వెలువడిన పలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ యాదవ్‌కు విజయావకాశాలు ఉన్నట్టు సూచించాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్‌కే మొగ్గు చూపడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, బీఆర్‌ఎస్‌ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా ఈ ఉపఎన్నిక ఫలితం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.

జోరుగా బెట్టింగ్‌లు!
గెలుపు ఓటములపై అభ్యర్థులతోపాటు వారి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నట్టు సమాచారం. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఉప ఎన్నికలో, జూబ్లీహిల్స్‌ ప్రజాతీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధం .. : జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సన్నద్ధం చేశామని ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌ తెలిపారు. నేడు కౌంటింగ్‌ నేపథ్యంలో గురువారం యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలోనీ మీడియా సెంటర్‌లో కౌంటింగ్‌ ఏర్పాట్లపై పాత్రికేయులకు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ చేస్తామన్నారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈసీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని 42 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గరిష్టంగా 10 రౌండ్‌లు చేస్తారని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియను ఈసీఐ సాధారణ పరిశీలకులు, ఈసీఐ బృంద సభ్యులు పరిశీలిస్తారని చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు.

వీరిలో కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌లు, కౌంటింగ్‌ అసిస్టెంట్‌లు, కౌంటింగ్‌ మైక్రో అబ్జర్వర్స్‌ ఉంటారన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌, ఈసీ యాప్‌ ద్వారా అప్‌డేట్‌ చేస్తామని చెప్పారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకు, కౌంటింగ్‌ ఏజెంట్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌.వి.కర్ణన్‌ స్పష్టం చేశారు. జాయింట్‌ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ రేపు కౌంటింగ్‌ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉంటాయని, నేడు కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని సమావేశంలో అదనపు కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, రిటర్నింగ్‌ అధికారి పి.సాయిరాం, విజిలెన్స్‌ అదనపు ఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -