”అమ్మా .. అమ్మా.. ఈ రోజు మా స్కూల్ కు గారడీ వాడొచ్చాడమ్మా..’ బేగ్ పక్కన పెట్టి తల్లి ఒడిలో ‘కూర్చుంది.
వాడూ, వీడు అన కూడదమ్మా.. అతను లేదా అంకుల్ అనాలి” ముఖం పైట చెంగుతో తూడుస్తూ మదువుగా చెప్పింది.
‘సరేనమ్మా ! ఆ అంకుల్ వెంట భార్య, నా ఈడు పిల్లలు ఇద్దరు ఉన్నారమ్మా.. పాపం వాళ్ళ బట్టలు చిరిగున్నాయమ్మా…” బాధగా అంది.
”ఇంకా…?” ఆసక్తిగా అడిగింది.
”మారేమో.. సర్కస్ చేశారు…!” కండ్లు మెరుస్తుండగా చెప్పింది.
”ఏమేం చేశారు..?”
”సన్నని ఇనుప రింగులోకి ఇద్దరినీ ఇరికించాడమ్మా… వాళ్ళు దూరలేక బాధ పడుతుంటే, నాకు ఏడుపొచ్చిందమ్మా..” గొంతు పూడుక పోయింది.
”ఇంకేం చేశారు..?”
”సన్నని తీగ మీద ఆకాశంలో, కర్ర పట్టుకొని అటూ, ఇటూ నడిచిందమ్మా ఆ చిన్న పిల్ల. ఎక్కడ కింద పడిపోద్దో అని నాకు చాలా భయమేసిందమ్మా..?” గుండెమీద చేయివేసుకొని ఆశ్చర్యంగా చెప్పింది.
”వాళ్ళ దగ్గరో జంతువుంటుందే..?” సాలోచనగా ప్రశ్నించింది.
”ఉందమ్మా. కోతి… భలే నవ్వించిందమ్మా. దానికే రంగు రంగుల అంగీ వేశారు. మైదానమంతా పిల్లి మొగ్గలేసింది. నెత్తి మీద పుస్తకాలు పెట్టుకొని, బడికి వెళ్లింది. మరేమో.. మౌళీతను కర్ర తీసుకుంటే.. గ్రౌండ్ అంతా తెగ పరిగెత్తింది. మాకు నవ్వీ నవ్వీ కడుపుబ్బి పోయిందమ్మా..” నవ్వుతూ చెప్పింది.
”పాపం.. కోతి” బాధగా అంది.
”ఎందుకమ్మా అలా అంటావు. మమ్మల్ని భలే ఎంటర్ టైన్ చేసింది. ” నవ్వుతూ చెప్పింది.
”అడవిలోనో, ఊళ్లలోనే స్వేచ్చగా తల్లి దండ్రులతో, తన పరివారంతో తిరిగే కోతిని పట్టుకొచ్చి – అన్నం పెట్టకుండా మాడ్చి, కొట్టి మరీ ఆట నేర్పిస్తారమ్మా. దాని ఆట, అభినయం చూపించి వీళ్ళు పొట్ట పోసుకుంటారు. జంతువుల స్వేచ్చనూ, వాని స్వాభావిక లక్షణాలను నశింపచేస్తున్నారమ్మా.” విచారంగా చెప్పింది.
”అయ్యో ..! మరి వాళ్ళు కూడా, ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నారు కదమ్మా..?” ప్రశ్నార్ధకంగా చూసింది. ”అవును చిన్నా.. వంశపారంపర్యంగా కొంతమంది ఆ వత్తిని కొనసాగిస్తున్నారు.. మరి కొంతమందేమో బీదరికంతో ఈ జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. ఇంతకీ నువ్వేమైనా ఇచ్చావా? లేదా?”
ఇవ్వాళ్ల నువ్విచ్చిన పాకెట్ మనీతో, బిస్కట్ పాకెట్ కొనుక్కున్నానమ్మా. సగం పాకెట్ మిగిలితే కోతికిచ్చానమ్మా. వెంటనే, దాని దగ్గరనుండి పెద్దమ్మాయి లాక్కుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది డబ్బులిచ్చారు. ఇవ్వాల డబ్బులు ఇవ్వని వాళ్ళు, రేపు ఇవ్వచ్చు అని మా హెచ్.ఎం. గారు చెప్పారు”.
”సరే..! నువ్వు వాడకుండా పక్కన పెట్టిన డ్రస్సులు, అమ్మాయిలకివ్వు. నాదో పాత చీర, కోతికి ఆరటి పండ్లు, అతనికి వంద రూపాయలు ఇస్తాను. రేపు బడిలో వాళ్ళకు అందజేయి.”
”మా మంచి మమ్మీ…” అని బుగ్గన ముద్దు పెట్టింది. తరువాత ”నాదో సందేహమమ్మా. వాళ్లలా ఎందుకున్నారు?మన మెందుకిలా ఉన్నాం?” సందేహంగా అడిగింది.
బిడ్డను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటూ… ”చాలా పెద్ద ప్రశ్న వేశావమ్మా. మీ నాన్నతో పాటు పనిచేసే లెక్చరర్స్ అంతా సమ్మె చేస్తున్నారు కదా. నాన్నిప్పుడు ధర్నా చౌక్ నుంచి వస్తాడు. రాగానే అడుగు. నీ సందేహాలకు సమాధానం చెబుతాడు” అంది కుర్చీలోంచి లేస్తూ.
ఆ రాత్రి నాన్న కోసం చాలా సేపు ఎదురు చూసింది పాప. నాన్న రాలేదు. అమ్మ ఆందోళనగా ఉంది. తనకు కలిగిన సందేహాలతో, నాన్న కోసం ఎదురు చూస్తూ అమ్మ ఒడిలో అలాగే నిద్ర పోయింది.
పుప్పాల కృష్ణ మూర్తి, 9912359345



