నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన జూకంటి అనిల్ ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెళ్లడయ్యాక జిల్లాలో అత్యధిక మెజార్టీ ఎవరికి వచ్చిందని నవతెలంగాణ పరిశీలించగా.. ఈ విషయం తెలిసింది. గ్రామంలో మొత్తం ఓట్లు 1801 ఉన్నాయి. అందులో 1647 ఓట్లు మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో పోలయ్యాయి. బీఆర్ఎస్, సీపీఐ(ఎం) మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. పోలైన ఓట్లలో 1279 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఆయనకు కేవలం 277 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఐఎంఎల్ బలపరిచిన అభ్యర్థికి 67 మాత్రమే వచ్చాయి. గెలుపొందిన అనిల్ కు 77.6 శాతం, కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన వ్యక్తి 17 శాతం, సీపీ ఎం ఎల్ పార్టీ మద్దతుతో పోటీలో ఉన్న వ్యక్తికి 4 శాతం మాత్రమే వచ్చాయి.
జిల్లాలో పోలైన ఓట్లలో జూకంటి అనిల్ కు 77 శాతం రావడం పట్ల ఇతర పార్టీల నాయకులు ప్రజలు చర్చించుకుంటున్నారు. మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీను జిల్లాలోని భారీ మెజారిటీతో గెలిచినందుకు అనిల్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జర్నలిస్టు అయిన జూకంటి అనిల్ కుమార్ కు గత ఐదేళ్లుగా ప్రజా సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఏది ఉన్న వెంటనే స్పందించి పని చేయడం, గ్రామంలో కోతులు పట్టి మేడారం అడవుల్లోకి పంపించడం, బతుకమ్మ పండుగ సందర్భంగా పోటీలు నిర్వహించడం, ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి చేదోడు వాదోడుగా ఉండడం, సిపిఐ ఎం పార్టీ మద్దతు తోటి జర్నలిస్టు సహకారం కూడా ఉండడంతో ఈ భారీ మెజార్టీ సాధ్యమైందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు హాజరైన అధికారులు పోటీ ఎందుకు పెట్టుకున్నారు ఏకగ్రీవం చేసుకుంటే అయిపోయేది కదా అని ఎన్నికల రోజే ఫలితాలు వెలువడిన తర్వాత అనడం విశేషం.



