Saturday, December 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిన్యాయం ఓటమి!

న్యాయం ఓటమి!

- Advertisement -

న్యాయం చివరి ఆశగా కోర్టు మెట్లెక్కిన బాధితకు అదే కోర్టు అన్యాయం చేస్తే? అది ఎవరికోసం అన్న ప్రశ్నే మిగులుతుంది. ఉన్నావ్‌ మైనర్‌పై లైంగికదాడి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, కుల్‌ దీప్‌సింగ్‌ సెంగార్‌ను విడుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఆ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్నే కూల్చేసింది. ఒక నిందితుడిని విడుదల చేసిన ఘటనగా దీన్ని చూడలేం. అది బాధితురాలి గుండెల్లో మిగిలిన ఊపిరిని తీసిన క్షణం. అవమానాలు,అవహేళనలను దిగమింగుతూ, దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కొంటూ, ఎనిమిదేండ్లుగా పోరా డుతున్న ఆ కుటుంబానికి పడిన శిక్ష ఏదైనా ఉందంటే అది నిజంగా ఇప్పుడే. ఇది బాధాకరం. ఆమె ఆక్రందనకు దేశమంతా స్పందించినా నాలుగు గోడల మధ్య ఉన్న నల్లకోటు మాత్రం చలించలేదు. సాక్ష్యాలు లేవనే సాకుతో కేసు కొట్టేసిన కోర్టు ఆ సాక్ష్యాలు ఎందుకు మౌనంగా ఉన్నా యో తెరచి చూడకపోవడం విచార కరం. దీన్ని న్యాయ వైఫల్యం అనడం కంటే అధికారానికి మోకరిల్లిన దౌర్భగ్యం అనడం సబబేమో!
2017లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ఘటన వెలుగులోకి రాగానే ఇది సాధారణ ఘటన కాదని స్పష్టమైంది. ‘నాకు న్యాయం కావాలి’ అంటూ రోడ్డెక్కినప్పటి నుంచే ఆమెపై ‘అధికార వ్యవస్థ’ దాడి ప్రారంభించింది. నిందితుడు పాలకపార్టీకి చెందిన ఎమ్మెల్యే, అందులో కుల ప్రభావం కలిగిన నేత. ఆమెను ఎత్తుకుపోయి రోజులపాటు నిర్భంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ నీచుడు. ఆమెను అమ్మేందుకు ప్రయత్నించాడు. చంపేందుకు కూడా వెనుకాడలేదు. చెరనుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదు. పైగా ‘మౌనంగా ఉండమని’ బెదిరింపులు, ఒత్తిళ్లు. మొదటి దశలోనే రాష్ట్ర యంత్రాంగం నేరస్తుడి పక్షాన నిలిచింది. పైగా నిందితుడితో చేతులు కలిపి రాజీకోసం ఆమెపైనే ఒత్తిడి తెచ్చారు. కేసు నమోదు కావడానికే ఏడాది పట్టింది. ఈలోగా ఏదో పాత కేసును తోడి ఆమె తండ్రిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. కాపాడుకోవాలని చేసిన ప్రయత్నంలో బాధితురాలు ఠాణాల వెంట తిరిగి తిరిగి చివరికి సీఎం ఇంటి ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. అప్పటికే అతను పోలీసు కస్టడీలోనే మరణించాడు. ముందు అనుమా నాస్పద మృతిగా చిత్రించినా తర్వాత హత్యేనని నిర్ధారణ అయింది.

సామాజిక, ప్రజాసంఘాల ఆందోళనలు మిన్నంటాయి. మీడియా కథనాలు, బాధితురాలి పక్షాన నిలిచాయి. ప్రజల నిరసనలు కోర్టు గోడలకు తాకాయి. రాజకీయంగా బీజేపీని అప్రతిష్టపాలు చేశాయి. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఇక్కడ కూడా న్యాయం కాదు, ఒత్తిడే పనిచేసింది. జైళ్లో ఉన్న కూడా బాధితురాలిపై వేట కొనసాగింది. 2019లో వారి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢకొీట్టింది. ఆ ఘటనలో ప్రధానసాక్షి ఆమె అత్త, మరో బంధువు చనిపోయారు. న్యాయవాదికి తీవ్రగాయలయ్యాయి. బాధితురాలు ఎయిమ్స్‌లో కొన్ని నెలల పాటు చికిత్స పొందింది. ఇది ప్రమాదమా, హత్యనా అన్నది జగమెరిగిన సత్యం! వరుసగా బెదిరిం పులు, హెచ్చరికలు, ముందుకొచ్చిన సాక్షులు కూడా భయంతో మౌనమయ్యారు. సుప్రీంకోర్టు జోక్యంతో కేసు సీబీఐకి బదిలీ అయి ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీ గేటును తాకింది. చివరికి ట్రయల్‌ కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. అప్పట్లో దీన్ని న్యాయ విజయంగా భావించారు. కానీ, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు శిక్షను సస్పెండ్‌ చేస్తూ ఇచ్చిన ఉపశమనం ఆ ‘విజయం’ ఎంత భ్రమలో ఉందో చాటింది.

ఇది ఒక్క ఉన్నావ్‌కే పరిమితం కాదు. బిల్కిస్‌బానో నుంచి కతువా వరకూ, డేరాబాబా నుంచి హత్రాస్‌ వరకూ, మణిపూర్‌ నుంచి మహిళా రెజ్లర్ల వరకూ.. మహిళల శరీరాలపై జరిగిన నేరాలు ఇప్పటికీ తీర్పుల గదుల్లో విచారణలోనే ఉన్నాయి. కానీ నిందితులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేవలం ప్రశ్నించిన పాపానికి ఉమర్‌ ఖలీద్‌ లాంటి జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి ‘ఉపా’ కింద జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ‘న్యాయం గెలుస్తుందని’ చెప్పుకుంటాం. కానీ, మన దేశ అనుభవం చెబుతున్న నిజం వేరే. గెలిచేదంతా న్యాయం కాదు, అధికారానికి నచ్చినంత న్యాయం మాత్రమే. మిగిలిన న్యాయం…బాధితురాలి కన్నీళ్లలో కరిగిపోతుంది, పైళ్ల మధ్య మాయమవుతుంది. తీర్పుల సాంకేతిక పదజాలంలో ఊపిరాడక చనిపోతుంది. ఈ ఘటనలన్నీ కలిపి చూస్తే ఒకే సరళి స్పష్టమవుతోంది. బాధితుడు బలహీన వర్గానికి చెందితే న్యాయం కోసం పోరాడాల్సిందే. నిందితుడు రాజకీయ, సామాజిక లేదా మత ప్రభావం కలిగినవాడైతే వ్యవస్థ అతనికి అనుకూలంగా మారుతుంది. అందుకే ఉన్నావ్‌ తీర్పు సభ్యసమాజానికి ఒక హెచ్చరిక. న్యాయం కోర్టు గదుల్లోనే రక్షించబడదు. ప్రజల నిరంతర ప్రశ్నలు, ఒత్తిడి లేకపోతే అది అధికారానికి బానిసగా మారుతుంది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సమాజమంతా స్పందించాలి. లేకపోతే ప్రతి ఉన్నావ్‌ తర్వాత మరో బిల్కిస్‌, మరో కతువా, మరో బాధిత- ఈ దేశ చరిత్రలో చేరుతూనే ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -