Sunday, February 15, 2026
E-PAPER
Homeసోపతి'సభ' నుండి 'సెటిల్మెంట్‌' దిశగా న్యాయం

‘సభ’ నుండి ‘సెటిల్మెంట్‌’ దిశగా న్యాయం

- Advertisement -

ఒకప్పుడు మన పల్లెల్లో ‘సభ’ అంటే గౌరవం. పెద్దలు కూర్చుంటే అది కోర్టు కాదు ఆశ్రయం. రెండు పక్షాలు వచ్చి తమ సమస్యలు చెబుతారు. పెద్దలు విని, తప్పు చేసినవారిని శిక్షిస్తారు. బాధపడిన వారిని ఆదరిస్తారు. అది డబ్బుతో కొనలేని న్యాయం. ఆ సభల్లో తీర్పు పడితే వందల మంది గుండెల్లో నమ్మకం పడేది. న్యాయం అనేది గొప్ప మాట కాదు అది ఒక గొప్ప స్వభావం.

కానీ ఈ రోజుల్లో ‘సభ’ అనే పదం అరుదవుతోంది. దాని స్థానంలోకి ఒక క్రూరమైన కొత్త వ్యవస్థ వచ్చింది, అదే ‘సెటిల్మెంట్‌’. ఈ సెటిల్మెంట్‌ అనేది కేసుల పరిష్కారం కాదు; ఇది మనిషి గౌరవం మీద ఒక వాణిజ్యం. న్యాయం కోసం కాదని, నష్టం భయంతో కాదని, సత్యం పట్ల ప్రేమతో కాదని డబ్బు కోసం జరిగే ఒక మౌన ఒప్పందం. ఇప్పుడు ఎవరి ఇబ్బంది వచ్చినా మొదటి మాట ఏమిటి? ”ఎంత ఇస్తే సద్దుమణుగుతారు?” ఈ మాటలోనే మన సంస్కతికి జరిగిన అత్యంత పెద్ద పతనం దాగి ఉంది. సత్యం, ధర్మం, న్యాయం ఇవన్నీ ధర పెట్టిన వస్తువుల్లా మారిపోయాయి. పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు పెట్టినా, న్యాయం పుస్తకాలలో ఉన్నట్టుగా జరగదు. మొదట ‘సంబంధాలు ఉన్నాయి?’ అని అడుగుతారు. తర్వాత ‘ఇతర పార్టీతో మాట్లాడితే సర్దుబాటు అవుతుందేమో’ అంటారు. అంటే, న్యాయం కోసం వెళ్లిన వ్యక్తి, చివరకు తన నొప్పిని డబ్బుకు అమ్మాలని ఒత్తిడి చేయబడతాడు. తప్పు చేసిన వారు క్షమాపణ కోరరు. వారు కేవలం చెక్‌ బుక్‌ తెరుస్తారు.

ఇది న్యాయమా? లేక వ్యాపారమా? కోర్టుల పరిస్థితి ఇంకా క్లిష్టం. ఏడాది తర్వాత మరో తేదీ. మరో ఏడాది తర్వాత మరో తేదీ. సాక్షులు వద్ధులు అవుతారు. వాస్తవాలు మాయమవుతాయి. సత్యం బలహీనపడుతుంది. చివరికి రెండు పక్షాలు విసిగిపోయి ‘సెటిల్మెంట్‌ చేసేద్దాం’ అంటారు. అక్కడ సత్యం ఓడిపోతుంది. ధర్మం ఓడిపోతుంది. న్యాయం విజయం కాకుండా డబ్బు విజయం అవుతుంది. మన సమాజంలో ప్రతి సమస్యకు ”సర్దుబాటు” అని చెప్పడం ఒక అభ్యాసంగా మారిపోయింది. రహదారిలో ప్రమాదం జరిగితే, స్త్రీలపై దాడి జరిగినా, వ్యాపార మోసాలు జరిగినా తక్షణం ”రెండు పార్టీల మధ్య చర్చ జరిగితే ఓకే” అంటారు. అయ్యో! న్యాయం అంటే చర్చేనా? న్యాయం అంటే లెక్కలేనట్టేనా? మనిషి గౌరవం, అతని బాధ, అతని కన్నీళ్లు ఇవన్నింటికీ ఒక ధర నిర్ణయించడం సాధ్యమేనా? ఈ ”నేటిల్మెంట్‌ కల్చర్‌” మనలో ఏమి చేసింది తెలుసా? తప్పు చేసిన వారు శిక్ష లేకుండా బ్రతకడం నేర్చుకున్నారు.

బాధపడిన వారు దుఃఖాన్ని అమ్మడం నేర్చుకున్నారు. సాక్షులు భయపడటం నేర్చుకున్నారు. సమాజం మౌనంగా ఉండటం నేర్చుకుంది. ఈ పరిస్థితిలో న్యాయం అనేది ఇక కోర్టులలో కాదు చెక్కుల మీదే జరుగుతోంది. ఈ వాస్తవాన్ని అంగీకరించడం సులభం కాదు, కానీ తిరస్కరించడం అసాధ్యం. ప్రతి న్యాయ వ్యవస్థలో ఒత్తిడులు ఉన్నాయి, అవినీతి ఉంది, దౌర్భల్యం ఉంది. కానీ మన దేశంలో ఇది మొత్తంగా ఒక వ్యవస్థగా మారిపోవడం మనలోని నిజమైన న్యాయం ఆత్మహత్య చేసుకున్నట్టే. అసలు ప్రశ్న ఏమిటంటే మనమే ఈ మార్పుని ఎందుకు అంగీకరించాం? ఎందుకంటే మనం నిజం కోసం పోరాడే ధైర్యాన్ని కోల్పోయాం. మనకు సమయం లేదు. మనకు తపన లేదు, మనకు ఓర్పు లేదు. కాని ఓర్పు లేన వాళ్లు న్యాయం ఎలా పొందగలరు? సమాజం మొత్తంగా ”తప్పు కాని ఓకే, కానీ కాంపెన్సేషన్‌ ఎంత?” అనే ఆలోచనకి మళ్లింది.

తప్పు చేసిన వారికి కూడా ఇది గొప్ప అవకాశం. వారు సత్యం ఎదుట నిలబడాల్సిన అవసరం లేదు. వారు మానవత్వం చూపాల్సిన అవసరం లేదు. వారు కేవలం తమ పొట్టలో ఉన్న డబ్బు చూపితే చాలు. నియమాలు, ధర్మం ఇవన్నీమునిగిపోతాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. సెటిల్మెంట్లతో కేసులు మూసిపోతాయి కానీ మనసులు కాదు. బాధలు కాదు. నొప్పులు కాదు. న్యాయం నిజంగా మన సమాజాన్ని రక్షించాలి అంటే మనం మళ్లీ ఆ పాత ‘సభ’ విలువలను గుర్తుచేసుకోవాలి. అక్కడ డబ్బు పనిచేయదు. అక్కడ సంబంధాలు పతనం కాదు. అక్కడ తప్పు చేసిన వారు నిజంగానే క్షమాపణ కోరాలి. అక్కడ బాధపడిన వారు నిజంగానే న్యాయం పొందాలి. సమాజం ముందుకు నడవాలంటే, న్యాయం రోడ్ల మీద కాకుండామన హృదయాల్లో నిలవాలి. న్యాయం ఖరీదు మార్చవచ్చు, కానీ దానికి ధర పెట్టకూడదు. ధర పెట్టిన రోజు సమాజం మనిషితనం కోల్పోతుంది.

డా|| సూర్యదేవర రామకృష్ణ,
9490754169

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -