Friday, May 23, 2025
Homeఎడిట్ పేజిజస్టిస్‌…గవాయ్'

జస్టిస్‌…గవాయ్’

- Advertisement -

సుప్రీంకోర్టు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్ ఈనెల 14న ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్‌ 23 వరకు ఆరునెలల పాటు పదవిలో ఉంటారు. ఆయన బాధ్యతల్లోకి రాక ముందు, వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఏ పదవిని స్వీకరించ బోనని ముందే ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సంజీవ్‌ఖన్నా వీడ్కోలు సభలో దీన్ని మరింతగా నొక్కి వక్కాణించారు. తమిళనాడు గవర్నర్‌ బిల్లుల్ని తొక్కిపెట్టిన అంశంలో న్యాయస్థానం మూడునెలల కాల పరిమితి విధించడం, దానిపై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ సుప్రీంకోర్టు సూపర్‌ వవర్‌ కాకూడదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం, ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలతో ఉత్తరం రాయడం, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త సీజేఐ మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వానికి లొంగిపనిచేయనని పరోక్షంగా సంకేతాలిచ్చి నట్టయింది. అయితే చట్టాన్ని తమ చుట్టంగా భావిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తున్న పాలకులకు ఇది మింగుడు పడని సమస్యగా పరిణమించింది. అందుకే మొన్న సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో పర్యటించిన సీజేఐని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. రాష్ట్ర సీఎస్‌, డీజీపీ గౌరవ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలకాల్సి ఉన్నప్పటికీ హాజరవకుండా అవమాన పరిచింది.
మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన ఈ పద కొండేండ్ల కాలంగా న్యాయవ్యవస్థను లొంగదీసుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. గతంలో కొలిజియం సిపార్సులు సైతం వెనక్కి తిప్పి పంపింది. నయానో, భయానో కొంతమంది న్యాయమూర్తులు ‘జీ హుజూర్‌’ అంటూ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులివ్వడం పట్ల ‘సుప్రీం’ సర్వత్రా విమర్శలను ఎదుర్కొంది. ఈ వినాశకర దుస్థితి జస్టిస్‌ రంజన్‌ గగోరుతోనే మొదలైంది. తర్వాత అబ్దుల్‌ నజీర్‌ త్రిపుల్‌తలాక్‌, పెద్దనోట్ల రద్దు, అయోధ్య లాంటి అంశాల్లో తీర్పు లిచ్చిన ధర్మాసనంలో సభ్యునిగా ఉన్నారు. ఆయన రిటైర్డ్‌ కాగానే కేంద్రం గవర్నర్‌ పదవిని గిప్ట్‌గా ఇచ్చించి. నజీర్‌కు రాజ్యాంగ బద్ధమైన పదవిని కట్టబెట్టడం వెనుక ‘ఆంతర్యం’ ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రెండేండ్ల పై చిలుకు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసిన డీవై చంద్రచూడ్‌ ఎన్నికల బాండ్లపై స్పష్ట మైన తీర్పునిస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాసిన కేంద్రం ఆర్థిక కుంభ కోణాన్ని బట్టబయలు చేశారు. కానీ పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు స్వయాన మోడీ న్యాయమూర్తి ఇంటికి వెళ్లడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఇలా మోదం.. ఖేదంలా సాగు తున్న న్యాయవ్యవస్థకు జస్టిస్ గవాయ్ మాటలు ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరిని పోశాయనే చెప్పాలి. సుప్రీం కోర్టుపై పెత్తనాన్ని సాగించాలనుకుంటున్నవారికి చట్టసభలు, కార్య నిర్వహణ, న్యాయవ్యవస్థ ఇందులో ఒకదానికొకటి ఏది ఎక్కువ కాదని పరోక్షంగా గవాయ్ స్పష్టం చేశారు.
తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై అత్యున్నత న్యాయస్థానం చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు సుదీర్ఘ కాలంగా ఆమోదముద్ర వేయ కుండా ఇబ్బందిపెట్టిన సందర్భంలో కూడా చట్టసభల సభ్యుల, కార్య నిర్వా హకవర్గ సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు. విద్వేషాన్ని ప్రోది చేయడాన్ని బలంగా అణచివేయాల్సిందేనని చెప్పారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ న్యాయవ్యవస్థకన్నా చట్టసభలే ఎక్కువని చెప్పడం, రాష్ట్రపతిని తక్కువ చేసినట్టుగా చిత్రించడం బీజేపీ వ్యూహాత్మక ధోరణిలో భాగమే! అప్పుడూ కూడా రాజ్యాంగమే సర్వోన్నత మైనదని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా తేల్చారు. ఆరేండ్లుగా సుప్రీంకోర్టులో న్యాయ మూర్తిగా పనిచేసిన గవాయ్ అనేక కీలక కేసుల బెంచ్‌ల్లో భాగ స్వామిగా ఉన్నారు. ఇందులో రాజ్యాంగ వ్యవహారాల నుంచి మొదలుకుంటే న్యూస్‌క్లిక్‌, ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియా, తీస్తా సెతల్వాద్‌ వంటి కేసుల్లో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్ల కుండా అనుకూల తీర్పులిచ్చారు. రాహుల్‌గాంధీకి పరువునష్టం కేసులో ఉపశమనమిచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం చేపట్టిన ‘బుల్డోజర్‌ న్యాయం’ చెల్లదని ఇచ్చిన తీర్పు పేద ప్రజలు, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతున్నది.
భారత న్యాయస్థానంలో పెండింగ్‌ కేసులు, న్యాయమూర్తుల కొరత వంటివి కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. కానీ వక్ఫ్‌ సవరణ చట్టం గవాయ్ ముందున్న అసలైన సవాల్‌. సంజీవ్‌ ఖన్నా న్యాయమూర్తిగా ఉన్నప్పుడే దీనిపై తీర్పు వెలువడాల్సి ఉన్నా దీన్ని కొత్త న్యాయమూర్తి పరిశీలిస్తారని చెప్పడం బహుశా, ఆయన మీద, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం కావచ్చు! భిన్నత్వంలో ఏకత్వం గల మనదేశంలో లౌకికవాదాన్ని పెంపొందించే బాధ్యత గవాయ్ పైన ఉన్నది. పాలకులు ‘విభజించు, పాలించు” నినాదంతో దేశాన్ని తిరోగ మనంలోకి తీసుకెళ్తున్నది చూస్తూనే ఉన్నాము. సమాజ అభివృద్ధికి, దేశ పురోగతికి, ప్రజల ఐక్యతకు వక్ఫ్‌లాంటి కేసుల్లో జస్టిస్ గవాయ్’గా ఉంటారా?ఉండాలన్నదే దేశ ప్రజల ఆకాంక్ష.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -