Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ చెల్లదు

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ చెల్లదు

- Advertisement -

విచారణ తీరు చట్టబద్ధంగా లేదు
హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌ లాయర్ల వాదనలు
గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడగింపు


హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులోని పిల్లర్‌ నెంబర్‌ 20 బీటలు వారడంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టును కొట్టేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. వారితోపాటు ఐఏఎస్‌ స్మితా సభర్వాల్‌, మాజీ ఐఏఎస్‌ ఎస్‌.కె.జోషి వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. కేసీఆర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదిస్తూ… కమిషన్‌ ప్రక్రియ చట్టబద్ధంగా లేదన్నారు. కేసీఆర్‌ కీర్తిప్రతిష్టలను దెబ్బతీసేలా కుట్ర జరిగిందన్నారు. కమిషన్‌ రిపోర్టు అసెంబ్లీలో పెట్టకముందే మీడియాలో వచ్చిందని, ప్రభుత్వంలో ఉన్న వారే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ పెట్టారని, పబ్లిక్‌ డొమైన్‌లో కూడా పెట్టేశారని చెప్పారు.

హరీష్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ… ప్రాజెక్టు నిర్మాణం క్యాబినెట్‌ ఆమోదం మేరకే జరిగిందన్నారు. మేడిగడ్డ వద్ద 2023 వరదలు వచ్చి ఒక పిల్లర్‌ బీటలు వారిందన్నారు. కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. దీనిపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ విచారణ తీరు చట్టబద్ధంగా లేదన్నారు. పిటిషనర్లపై ఆరోపణలు చేసిన వాళ్లను విచారణ చేసేందుకు, ఆ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వీలుగా సెక్షన్‌ 8బి, 8సి ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్నారు. కమిషన్‌ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించడం చెల్లదని చెప్పారు. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటి వరకు కమిషన్‌ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోరాదన్న గత మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

హైడ్రాకు రూ.లక్ష జరిమానా ప్రయివేటు స్థలంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన ఫలితం
ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ప్రయివేటు వ్యక్తులకు చెందిన స్థలంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన హైడ్రాకు హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్లకు చెల్లించాలంది. వెంటనే పెన్సింగ్‌ను తొలగించాలని ఆదేశించింది. గడువు తీసుకుంటే రోజుకు లక్ష రూపాయలు చొప్పున పిటిషనర్‌కు చెల్లించాలంది. ఆధారాలు లేకుండా ప్రభుత్వ స్థలమని చెప్పి ఫెన్సింగ్‌ ఏర్పాటు చెల్లదని మరోసారి తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌ మండలం మల్లాపూర్‌లోని ఒక సర్వే నెంబర్‌లో ఉన్న బాబానగర్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ లేఔట్‌లోని రెండు ప్లాట్‌లకు ఫెన్సింగ్‌ వేయడాన్ని సవాల్‌ చేసిన కేసులో జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ అడ్వొకేట్‌ కమిషన్‌ ద్వారా క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.

చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పండి : ధర్మసాగర్‌ చెరువు ఆక్రమణలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
నిర్మల్‌ జిల్లా ధర్మసాగర్‌ చెరువులో ఎఫ్‌టీఎల్‌ ప్రాంతంలో జరిగిన నిర్మాణాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ధర్మసాగర్‌లోని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్రయివేటు నిర్మాణాలు వెలిశాయని, ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిర్మల్‌కు చెందిన ఎన్‌.శ్రావణ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిని సీజే బెంచ్‌ విచారించి.. ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -