Thursday, February 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిన్యాయం.. తీర్పు…

న్యాయం.. తీర్పు…

- Advertisement -

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు…24 ఏండ్ల నాటి ఉదంతాన్ని మరోసారి గుర్తుచేసింది. ఈ తీర్పు బాధితురాలి కుటుంబానికి నిజంగా న్యాయం చేసిందా? లేదా? అనేది శేషప్రశ్న. ఇన్నేండ్లపాటు నిరీక్షించిన తమకు అన్యాయమే జరిగిందన్న ఆమె తల్లి రోదన అరణ్య రోదనగానే మిగిలిపోవటం విషాదకరం. మరోవైపు మనదేశంలో న్యాయస్థానాల నుంచి తీర్పులు వెలువడాలంటే దశాబ్దాలపాటు ఎదురు చూడాల్సిందేననే విషయాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది. కర్రున్నోడిదే బర్రె అన్నట్టు ఈ కేసులో రాజకీయ నేతల జోక్యం, పలువురి పెద్దల ప్రమేయంతో ఏనాడో అది నీరుగారి పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు హైకోర్టు ఇచ్చిన రెండేండ్ల జైలుశిక్ష తీర్పును సమర్థిస్తూ ‘నాలుగు వారాల్లో లొంగిపోండి…’అంటూ నిందితుడిని సుప్రీం ఆదేశించటం ఒకింత ఉపశమనమనే వాదనా లేకపోలేదు.

ప్రత్యూషకేసు న్యాయవ్యవస్థపై విశ్వసనీయత, దాని సమర్థత, దక్షతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సామాన్యుడు పోలీస్‌ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాలనే ప్రచారం దేశంలో ఏనాటి నుంచో ఉంది.’న్యాయస్థానాల్లో న్యాయం గెలుస్తుందనే మాట నిజమేగాని.. గెలిచేదంతా న్యాయం కాదు…’ అనే వాస్తవాన్ని కూడా మనం గుర్తెరగాలంటారు ప్రముఖ న్యాయ కోవిదులు. గతంలో దేశంలో జరిగిన వివిధ సామూహిక అత్యాచారాలు, మూక దాడులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలపై అఘాయిత్యాలు, వాటికి పాల్పడిన వారిపట్ల న్యాయస్థానాలు అనుసరించిన, అనుసరిస్తున్న ధోరణులు దీనికి ప్రబల తార్కాణాలు. పారిశ్రామికాభివృద్ధికి కార్మిక సంఘాలే అవరోధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి.

మరోవైపు గ్యాంగ్‌రేప్‌లకు పాల్పడిన వారు బెయిల్‌పై విడుదలైతే వారిని ఊరేగిస్తూ స్వాగతాలు పలకటం, వివిధ కేసుల్లో శిక్షలు పడి, బయటకు వచ్చిన వారికి సత్కారాలు చేయటం దేశంలో షరా మామూలై పోయింది. ఇదే సమయంలో ప్రజా సమస్యల పోరాడే వారిని నిర్బంధించటం, పౌరహక్కుల కోసం నినదించే వారిని ‘ఉపా’ లాంటి చట్టాల పేరిట ఏండ్ల తరబడి జైళ్లలో వేయటం రివాజుగా మారింది. ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలైనప్పుడు… నెలల తరబడి వాయిదాలు వేయటం, పలు వ్యాఖ్యలు చేయటం, చివరకు ‘ఎలాగోలా’ ప్రభుత్వానికో, అధికారులకో వత్తాసు పలకటం న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ హయంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె, తదనంతర పరిణామాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.

ఈ క్రమంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సామాన్యులు సమిధలవుతున్న ప్రస్తుత తరుణంలో… వారికి అండగా నిలబడి, బతుకు మీద భరోసానివ్వాల్సిన న్యాయస్థానాలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి. పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య వేలల్లోకి చేరుతుండగా.. వాటిని పరిష్కరించాల్సిన న్యాయమూర్తుల సంఖ్య పదుల సంఖ్యలో ఉందంటూ గతంలో ఒక ప్రముఖ జడ్జి ఆవేదన వ్యక్తం చేయటం కోర్టుల దుస్థితిని తెలియజేస్తోంది. అయితే లోక్‌ అదాలత్‌ల రూపంలో ఏండ్లపాటు అపరిష్కృతంగా ఉన్న వందల కేసులను పైసా ఖర్చు లేకుండా అందిస్తున్న తీరు అభినందనీయం, హర్షణీయం. అయితే ఈ కృషి సరిపోదు. పేదలు, మహిళలు, కార్మికులు, ఎలాంటి అండా లేని వారికి సత్వరమే న్యాయం దక్కుతుందన్న విశ్వాసాన్ని మనకోర్టులు కల్పించగలగాలి.

ఈ దేశంలో ప్రతీ పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలకు న్యాయస్థానాలు వెన్నుదన్నుగా నిలవాలి. స్వేచ్ఛగా జీవించే హక్కు, పని హక్కు, తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. వీటిని న్యాయ వ్యవస్థ కంటికి రెప్పలా కాపాడాలి. అంతేతప్ప బొబ్బిలిపులి సినిమాలో ‘కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే.. ఇది న్యాయమెలా అవుతుంది యువరానర్‌..?’ అంటూ ఎన్టీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా పరిస్థితి ఉండకూడదు. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం, చక్కబెట్టాల్సిన అనివార్యత ప్రజలు, పౌర సమాజం మీద ఉంది. ఇందుకోసం న్యాయ వ్యవస్థలో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఈ బాధ్యత మేధావులు, న్యాయవాదులు, నిపుణులదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -