హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు భగత్ డిమాండ్
నవతెలంగాణ – వనపర్తి
తన సోదరుడు కులాంతర వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించాడనే సాకుతో అమ్మాయి తరపు బంధువులు రాజశేఖర్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని, రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు భగత్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన రాజశేఖర్ హత్య నేపథ్యంలో నిందితులను కఠినంగా శిక్షిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు భగత్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.వెంకట్ రాములు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో దళిత యువకుడు ఓ యువతని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిపారు.
తన సోదరుడి కులాంతర వివాహానికి ప్రోత్సహించారని నెపంతో రాజశేఖర్ అనే వ్యక్తిని అమ్మాయి బంధువులు రాజశేఖర్ను ఇంటి నుంచి తీసుకెళ్లి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం, సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అన్నారు. బాధిత కుటుంబాన్ని పోలీసులు వేధించారని తెలిపారు. హత్య జరుగుతుందని తెలిసి విచారణలో జాప్యం చేస్తున్నారని వాపోయారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో కులాంతర వివాహ రక్షణ చట్టం తేవాల్సిందేనని డిమాండ్ చేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. కులాంతర వివాహ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం, సామాజిక సమానత్వం సాధించేవరకు అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు గంధం గట్టన్న, రమేష్, ఓంకార్, బాలపీరు, మధు, ఐద్వా నాయకురాలు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.



