ఎస్సీ గురుకులాల కార్యదర్శికి ఎమ్మెల్సీ కొమరయ్య వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 317 జీవో బాధిత గురుకుల ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని కోరారు. ఈ మేరకు ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్యను గురువారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో 317 జీవో అమలు కారణంగా అనేక మంది ఎస్సీ గురుకుల ఉపాధ్యాయులు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. స్థానికతను పక్కనబెట్టి చేసిన బదిలీల వల్ల ఉపాధ్యాయులు వారి కుటుంబాలకు, పిల్లల విద్యకు దూరమై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అన్యాయాలను సరిదిద్దాలనీ, ఇతర జోన్లకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు వారి స్వస్థలాల్లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. 317 జీవోలో జరిగిన అన్యాయాలను సరిచేసి, స్థానికత ఆధారంగా బదిలీలను పున్ణసమీక్ష చేయాలని కోరారు.
గురుకుల ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు కల్పించాలనీ, సర్వీస్ అంశాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగులందరికీ జీతాలు, డైట్ ఛార్జీలు, బిల్డింగ్ అద్దెలు వంటి పెండింగ్ బకాయిలను వేగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులకు తప్పనిసరిగా మొదటి తేదీ నాటికి జీతాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని కార్యదర్శి ప్రకటించారని వివరించారు. డైట్ ఛార్జీలు, బిల్డింగ్ అద్దెలు వంటి పెండింగ్ బిల్లుల మంజూరు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా సర్వీస్ అంశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు. టిగారియా ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిగారియా నేతలు మధుసూదన్, ఎస్ గణేష్, జి నాగిరెడ్డి తదిరులు పాల్గొన్నారు.