Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంబాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి

- Advertisement -

– నిందితుడికి శిక్షను కొనసాగించాలి
– జంతర్‌మంతర్‌ వద్ద ‘ఉన్నావ్‌’ బాధితురాలు, కుటుంబ సభ్యుల ఆందోళన
– విద్యార్థి సంఘాల మద్దతు

– నేడు సుప్రీం కోర్టులో విచారణ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

తమకు న్యాయం చేయాలని, నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ‘ఉన్నావ్‌’ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కేసులో నిందితునికి ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌ ఇవ్వడంతో వారు సుప్రీంకోర్టులో పోరాడేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రానుంది. ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ), ఆల్‌ ఇండి యా ప్రోగ్రెసివ్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ (ఏఐపీడబ్ల్యూఏ) సంఘాల విద్యార్థులు, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. ”ఉన్నావ్‌ నిరసన బాధితురాలికి సంఘీభావం ప్రకటించండి”, ”అత్యాచార సంస్కృతిని అంతం చేయాలని డిమాండ్‌ చేయండి”, ”లైంగికదాడి నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగర్‌ బెయిల్‌ రద్దు చేయండి” అనే బ్యానర్లతో ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ఘటన అనంతరం న్యాయ పోరాటం చేస్తున్న క్రమంలో సీబీఐ సరిగా స్పందించకపోవడం వల్ల నిందితుల వల్ల తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని నమ్ముతున్నానన్నారు. తన కోసమే కాకుండా తనలాంటి ఎంతో మంది కోసం గళం విప్పుతున్నానని ఆమె స్పష్టం చేశారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ రక్షించాల్సిన వారే మాపై దౌర్జన్యం చేశారుని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుని వల్ల కుటుంబానికి హాని ఉందని, సీఎం చొరవ తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నానన్నారు. వారి కోసం నిలబడిన వారి బంధువులపై నకిలీ కేసులు నమోదు చేశారన్నారు. ఇప్పుడు కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ బెయిల్‌పై రావడం వల్ల మరింత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరసనకారురాలు నేహ డప్పు వాయిస్తూ ఆజాది నినాదాలు చేస్తూ ‘జంతర్‌ మంతర్‌ ప్రతిధ్వనులను సుప్రీంకోర్టు గమనించాలి. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం, భద్రతను కల్పించాలి’ అని అన్నారు. సామాజిక కార్యకర్త యోగితా భయాన మాట్లాడుతూ నిరంతర మానసిక ఒత్తిడి, న్యాయంలో జాప్యం ఇప్పుడు ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయ న్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అధితి, జాయింట్‌ సెక్రటరీ డానిష్‌లు మాట్లాడుతూ నిందితులను రక్షించే విధానాన్ని ఖండించారు. హత్రాస్‌ నుంచి ఉన్నావ్‌ వరకు లైంగికదాడి చేసిన వారిని రక్షించడం, న్యాయం కోరినందుకు బాధితులను చంపడం, బెదిరించడం, నిర్బంధించడం వంటివి పదే పదే చూస్తూనే ఉన్నామన్నారు. కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జైలు శిక్ష నిలిపివేయడం వెంటనే రద్దుచేయాలని, బాధితురాలికి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పఢావో’ నినాదం ఏమైందని ప్రశ్నిం చారు. ఇండియా గేట్‌ వద్ద, పార్లమెంటు సమీపంలో బాధితురాలిని నిర్బంధిం చడం దారుణమన్నారు. ఈ సందర్భంగా రెజర్ల నిసరన అంశాన్ని గుర్తు చేశారు. దారుణమైన నేరాలలో దోషులకు విధానపరమైన ఉపశమనం కంటే, బాధితుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.

కాగా, జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనపై కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు మద్దతు ఇచ్చే మహిళా బృందం ఒక్కసారిగా దూసుకొచ్చింది. మెడలో కాషాయ కండువాలు ధరించి ”నేను కుల్దీప్‌ సెంగార్‌కు మద్దతు ఇస్తున్నాను” అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకున్న ఒక మహిళ ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని నమ్ముతున్నానంటూ, ‘సెంగార్‌ బెయిల్‌కు అర్హుడు’ అని కేకలు వేస్తూ హడావుడి చేసింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని, ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు ప్రయత్నం తర్వాత ఆ మహిళను అక్కడి నుంచి పంపించారు.

నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. కాజ్‌లిస్ట్‌ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిV్‌ా లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -