ఐదు వామపక్షాల నేతల విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ప్రతిపక్షాల అభ్యర్ధిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి (రిటైర్డ్) అభ్యర్ధిత్వాన్ని వామపక్షాలుగా తాము బలపరుస్తున్నామని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ), అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (ఎఐఎఫ్‌బీ)లు తెలిపాయి. అన్నింటికన్నా జాతీయ ప్రయోజనాలే మిన్నగా భావించి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకుని, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఐదు వామపక్షాల నేతలు ఉప రాష్ట్రపతిని ఎన్నుకునే పార్లమెంట్ సభ్యులను కోరారు. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎఐఎఫ్‌బీ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌లు సంయుక్తంగా ఒక విజ్ఞప్తిని చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రముఖ న్యాయ నిపుణుడని, భారత రాజ్యాంగం కీలక విలువలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం పట్ల ఆయనకు గల అచంచలమైన నిబద్ధతకు గానూ ప్రజల్లో గౌరవాభిమానాలు మెండుగా వున్నాయి.
ఉప రాష్ట్రపతి ఎన్నిక అంటే కేవలం గణాంకాలు కాదు, భవిష్యత్ భారతం గురించి ప్రాధమికంగా రెండు భిన్నమైన అభిప్రాయ ధోరణుల మధ్య గల పోటీని ఇది ప్రతిబింబిస్తోంది. సెక్యులరిజాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని మన దేశం కొనసాగించాలా లేక హిందూత్వ నియంతృత్వ దేశం స్థాయికి దిగజారిపోవాలా అనేది తేల్చుకోవాల్సి వుంది. ఒక పక్క మన సమకాలీన సంస్కృతిని పరిరక్షించేందుకు, మరోపక్క ఉప రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్, గవర్నర్లు, తదితర రాజ్యాంగ పదవులను దుర్వినియోగం చేయడం ద్వారా నియంతృత్వాన్ని అమలు చేసే, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు మధ్య జరుగుతున్న పోరాటం ఇదని వామపక్షాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. అందువల్ల అన్నింటికంటే జాతీయ ప్రయోజ నాలే మిన్నగా భావించి ఈ ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని వామపక్షాల నేతలు ఆ ప్రకటనలో కోరారు.
ఎంపీలందరికీ లేఖ రాస్తా : సుదర్శన్ రెడ్డి
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరికీ లేఖలు రాయనున్నట్లు జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి శుక్రవారం చెప్పారు. ఉప రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం కల్పిస్తే, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముంబ యిలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా బ్లాక్ కూటమికి వెలుపల గల వ్యక్తులు కూడా తనకు మద్దతునిచ్చేందుకు ముందుకు రావడం పట్ల కృతజ్ఞుడినని ఆయన వ్యాఖ్యానిం చారు. అంతకుముందు ఆయన శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్‌న్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌లను కలిశారు. సెప్టెంబరు 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలి
- Advertisement -
- Advertisement -