నియామక ప్రక్రియ ప్రారంభం
నవంబర్ 23న సీజేఐ బీఆర్ గవాయ్ ఉద్యోగ విరమణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం కానున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని నియమించే ప్రక్రియను ప్రభుత్వం గురువారం ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీజేఐ జస్టిస్ గవాయ్ తదుపరి సీజేఐని పేర్కొనాలని కోరుతూ రాసిన లేఖను శుక్రవారం అందించనున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతులకు మార్గనిర్దేశం చేసే నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తే సీజేఐ నియామకాన్ని నిర్వహించడానికి అర్హత ఉంది.
సంప్రదాయకంగా సీజేఐగా ఉన్నవారు 65 ఏండ్ల వయస్సు నిండినప్పుడు పదవీ విరమణ చేయడానికి ఒక నెల ముందు లేఖ పంపుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుత సీజేఐ తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. దీంతో ఆయనే సుప్రీంకోర్టు సీజేెఐ అయ్యే అవకాశం ఉంది. ఆయన నవంబర్ 24న తదుపరి సీజేఐగా నియామకమవుతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు.