Saturday, January 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబీమా రంగానికి స్ఫూర్తి ప్రదాత జ్యోతిబసు

బీమా రంగానికి స్ఫూర్తి ప్రదాత జ్యోతిబసు

- Advertisement -

మార్క్సిస్టు యోధుడు, సీపీఐ(ఎం) ఆవిర్భావ నాయకులు, ప్రజా, కార్మిక పక్షపాతి జ్యోతిబసు పదహారవ వర్థంతి నేడు. నాడు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి గా జ్యోతిబసు లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలన రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేసిన విషయం దేశమతా తెలిసిందే. కరువు రాష్ట్రంగా కునారిల్లిన పశ్చిమబెంగాల్‌ను అన్నపూర్ణగా మార్చింది.అణగారిన వర్గాలకు ఇరవై ఐదు లక్షల ఎకరాలను పంచి (భూ సంస్కరణలు చేపట్టి) దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది. కష్టజీవులకు, కార్మిక వర్గానికి అండదండలిచ్చింది. అంతర్జాతీయ సౌహార్ధతకు దిక్సూచిగా నిలిచింది. అలాగే ఎల్‌ఐసి పరిరక్షణకు పూర్తి బాసటగా నిలిచింది.దీనివల్ల,బీమా ఉద్యోగుల పోరాటాలు విజయవంతమయ్యాయి.

”ఇలాకో విజిలు పేరుతో ఆటోమేషన్‌ (కంప్యూటరీకరణ)కి వ్యతిరేకంగా ఏఐఐఇఏ, జరిపిన పోరాటంలో జ్యోతిబసు లెఫ్ట్‌ఫ్రంట్‌ శ్రేణులు నిర్వర్తించిన మహత్తరమైన పాత్రను ఎల్‌ఐసి ఉద్యోగులు ఎవరూ మర్చిపోలేరు. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన ఉన్న సందర్భంగా ఎలాగైనా సూపర్‌ కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలనే ప్రభుత్వ, యాజమాన్య ప్రయత్నాలు ఫలించలేదు.1968 దసరా సెలవుల్లో కంప్యూటర్‌ను ఇలాకో భవనంలో పెట్టాలని ప్రయత్నాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో పెద్దఎత్తున ఇలాకో విజిల్‌ కొనసాగింపు జరిగింది. ఇలాకో భవనం దగ్గర కాళీమాత విగ్రహం పెట్టి దసరా పండగ నిర్వహించారు. జ్యోతిబసు, ఇతర కమ్యూనిస్టు యోధులు, ఇతర రాజకీయ నాయకులు, జాతిన్‌ చక్రవర్తి, జ్యోతిర్మయి బసుతో బాటు అనేక మంది ఈ విజిల్‌లో పాల్గొన్నారు. 24 పరగణా జిల్లాలోని గిరిజనులు(వీరికి గతంలో కరువు సందర్భంగా అంబలి ఇచ్చి ఎఐఐఈఎ యూనిట్లు వారిని ఆదుకున్నాయి)తమ విల్లంబులతో వచ్చి ఈ విజిల్‌లో పాల్గొన్నారు.24 గంటలూ, 365 రోజుల పాటు ఈ ఉద్యమం కొనసాగింది.

ప్రభుత్వ అంచనాలు తలకిందులె యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది.అప్పటి హోంమంత్రి జ్యోతిబసు ఇలాకో భవనంలో కంప్యూటర్‌ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. చివరకు ఫోర్ట్‌ విలియమ్స్‌లో మిలిటరీ రక్షణలో ఉన్న కంప్యూటర్‌ను పశ్చిమబెంగాల్‌ నుండి వెనక్కు తరలించారు. కంప్యూటరీకరణ వ్యతిరేక ఉద్యమం చరిత్రాత్మక విజయం సాధించింది.ఆటోమేషన్‌ వ్యతిరేక ఉద్యమంలో భారత కార్మిక వర్గానికి దశను, దిశను నిర్దేశిస్తూ ఏఐఐఇఏ సాగించిన ఈ ఉద్యమంలో జ్యోతిబసు ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను, మేధావులు భాగస్వాములయ్యారు.కంప్యూటర్‌ పరిజ్ఞానం మన దేశంలో ప్రాధమిక దశలో ఉన్న నేపథ్యంలో బీమా ఉద్యోగులు ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలో కంప్యూటరీకరణ విజయవంతంగా చేయగలిగిన ప్రభుత్వం ఎల్‌ఐసిలో ఓటమి చూడవలసి వచ్చింది.

ఒక కంప్యూటర్‌ వస్తే దాదాపు 24వేల ఉద్యోగాలు ఎలా పోతాయో ఉద్యోగులు అర్థం చేసుకోగలిగారు. వారిని ఈ పోరాటం జాగృతం చేసింది.పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు, కార్మికవర్గ రాజకీయాలు ఈ ఉద్యమానికి కొత్త ఊపునిచ్చాయి. నవంబర్‌, 67 నుండి మార్చి ,69 వరకు (రాష్ట్రపతి పాలన అమలుఉన్న కాలంలో) అక్కడ ప్రజాతంత్ర ఉద్యమం బీమా ఉద్యోగుల పోరాటాలకు రక్షణాకవచంగా ఉంది.1969 ఎన్నికలలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ఎన్నిక బీమా ఉద్యోగుల పోరాట విజ యానికి బాసటగా నిలిచింది. ఆనాడే కంప్యూటర్లు ఎల్‌ఐసిలో ప్రవేశించి ఉంటే వేలాది మంది ఉద్యోగాలుపోవడమే గాక, సంస్థలో తర్వాత తరాల ఉద్యోగులకే ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు. అందుకే ఈ మహత్తర పోరాటంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రాధాన్యతను, జ్యోతిబసు చిరస్మరణీయమైన పాత్రను ఎల్‌ఐసి ఉద్యోగులు నిరంతరం జ్ఞాపకం ఉంచుకుంటారు.

1978లో కలకత్తాలో జరిగిన ఏఐఐఇఏ సిల్వర్‌ జూబ్లి సమావేశాలకు జ్యోతిబసు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బీమా రంగాన్ని ప్రయివేటుపరం చేయడంతో బాటు, ఎల్‌ఐసి, జిఐసిలలో యాభైశాతం వాటాలు విక్రయించాలన్న మల్హోత్రా కమిటీ (1994) కమిటీ సిఫార్సు లకు వ్యతిరేకంగా ఆనాడు వామ పక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. జ్యోతిబసు ఆధ్వర్యంలోని పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం, మల్హోత్రా కమిటీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదించింది.అలాగే అప్పటి వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర ప్రభుత్వాలు సైతం ఇదే మాదిరిగా తీర్మానాలు ఆమోదించాయి.ప్రభుత్వ బీమారంగ పరిరక్షణ కోసం ఎల్‌ఐసి ఉద్యోగులు చేసిన ప్రతి పోరాటానికి సంపూర్ణ సహకారం అందించి, జ్యోతిబసు మొత్తం కార్మిక వర్గంతో బాటు, ఎల్‌ఐసి ఉద్యోగులకు కూడా ప్రీతి పాత్రులయ్యారు.

లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంఅధికారంలో ఉన్నంత కాలం పశ్చిమబెంగాల్‌లో శాంతి, సామరస్యాలు పరిఢవిల్లాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా దేశమంతా మత కల్లోలాలు ప్రజ్వరిల్లినా, పశ్చిమ బెంగాల్‌లో ఒక్క అవాంఛనీయ సంఘటన జరగలేదు. మతోన్మాదశక్తుల పీచమనచడంలో జ్యోతిబసు ప్రభుత్వం స్ఫూర్తివంతమైన పాత్ర పోషించింది.నేడు దేశంలో నెలకొన్న మత ఉద్రిక్తత పరిస్థితులు పురోగామి శక్తులను కలవరపెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో జ్యోతి బసు లాంటి పాలనాదక్షుల, రాజనీతిజ్ఞుల అవసరాన్ని మొత్తం దేశం గుర్తిస్తోంది ఎల్‌ఐసి సంస్థపై, ఉద్యోగులపై, కార్మికవర్గంపై నిరంతరం దాడులు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో జ్యోతిబసు జీవితం కార్మిక వర్గానికి, ప్రత్యేకించి బీమా ఉద్యోగులకు ప్రేరణ ఇస్తుంది. ఎల్‌ఐసి సంస్థను,ప్రభుత్వ రంగాన్ని, కార్మిక హక్కులను, దేశ సమ్మిళిత సంస్కృతిని, సెక్యులర్‌, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయడమే జ్యోతిబసుకు బీమా ఉద్యోగులిచ్చే నిజమైన నివాళి.

పి.సతీష్‌
9441797900

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -