మనిషిని మిగిలిన జంతువుల నుంచి వేరుచేసి చూపించేది జ్ఞానం. ఆ జ్ఞానానికి ప్రధానమైన వనరు చదువు. అట్లాంటి విద్య ఈనాడు అందరికీ అందుబాటులో ఉంది.దీనికి కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాశయుడు రాసిన రాజ్యాంగం.అయితే భారత రాజ్యాంగం అమలులోకి రావటానికి ముందు ఈ దేశంలో అధిక సంఖ్యాకులైన ప్రజానీకానికి చదువుకునే హక్కు లేదు.ఆ ప్రజలందరూ కింది కులాలకే చెందినవారు కావటం యాదృచ్చికమేం కాదు. కావాలనే ఒకవర్గం మరొక వర్గాన్ని జ్ఞానానికి దూరం చేసింది.తద్వారా వీరిని అన్ని రకాలుగా దోపిడీ చేయగలిగింది. ఈ దోపిడీ ప్రక్రియ దాదాపు రెండువేల ఏండ్ల కిందట మొదలై రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు నిరాఘాటంగా కొనసాగింది.ఈ క్రమాన్నంత ఆధునిక భారతదేశంలో మొట్టమొదట సారిగా శాస్త్రీయంగా పరిశీలించినవాడు ఫూలే. ఆయన 1827 ఏప్రిల్ 11న జన్మించి,1890 నవంబర్28న మరణించాడు. నిజానికి ఆ కాలంనాటికి ఇంకా శాస్త్ర సాంకేతికత అందుబాటులోకి రాలేదు.
కింది వర్గాల చరిత్రను గానీ వారి సమాచారాన్ని గాని నమోదు చేసిన వాళ్లెవరూ లేరు. కింది వర్గాల వారి సాహిత్యమూ లేదు.ఫూలే కాలం నాటికి శూద్ర, అతిశూద్రులుగా పిలవబడుతున్న కింది వర్గాల వారి జీవితాల్లో ఉన్నదంతా చీకటే. వాళ్ల ముందున్నది ఏ దారీ తెలియని కీకారణ్యమే.ఆ చీకట్లోనే,ఆ అడవిలోనే చేతిలో విద్య అనే జ్యోతిని పెట్టుకుని భవిష్యత్తరాలకోసం కొత్తదారిని నిర్మించాడు ఫూలే.తరువాత అంబేద్కర్ అదే దారిలో నడిచాడు.ఫూలే ఆశయాలను రాజ్యాంగబద్ధం చేసి ఈ దేశంలో తరతరాలుగా అణిచివేతలో ఉన్న ప్రజలకు అన్ని రకాల హక్కులను ప్రసాదించగలిగాడు. ఫూలేను తన ముగ్గురు గురువుల్లో ఒకరిగా భావించి తన ”శూద్రులెవరు?”అన్న ప్రసిద్ధ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. ఇన్ని రకాల చట్టాలు,రాజ్యాంగ రక్షణలు ఉన్న ఈ అత్యాధునిక కాలంలోనే స్త్రీలు హింసనూ, వివక్షను అనుభవిస్తుంటే ఫూలే కాలంనాటికి వాళ్ల పరిస్థితి ఎంతగా దిగజారిపోయి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్త్రీలు చదువుకోవటాన్ని ధర్మశాస్త్రాలు ఒప్పుకోవని, వారు చదువుకుంటే సమాజానికి కీడు దాపురిస్తుందని ఆనాటి పండితులు ప్రచారం చేసేవారు.అమాయకులైన ప్రజలు నమ్మేవారు.
స్త్రీలతో పాటు శూద్రుల,అతిశూద్రుల పరిస్థితి కూడా ఇదే.చదువు లేకపోవటంవల్లనే పైన ఉన్న వర్గాలు ఈ ప్రజలను మోసం చేస్తున్నాయన్న సంగతిని తన జీవితానుభవాల ద్వారా ఫూలే గుర్తించాడు.అందుకే వారికి చదువు చెప్పి వాళ్లను చైతన్యం చేయాలనుకున్నాడు.ఈ దేశంలో చదువొక్కటే జీవితాలను మారుస్తుందని నమ్మిన మొట్టమొదటి సంస్కర్త మహాత్మా ఫూలే.చదువుకు, జ్ఞానానికి ఉన్న సంబంధాన్ని ఆయన గుర్తించాడు. అందరితోపాటు తన చదువు విషయంలోనూ బ్రాహ్మణవర్గం ఎట్లా కుట్రలు చేసిందో ఆయనకు తెలుసు. అందుకే బ్రాహ్మణ వర్గం ఒకటే ఉన్నతంగా జీవిస్తూ మిగిలిన వర్గాలు అణగారిపోవటానికి దారితీస్తున్న ఇతర కారణాల గురించి ఆలోచించాడు. మతసాహిత్యాన్ని విమర్శనాత్మ కంగా అధ్యయనం చేసాడు.ఈ క్రమంలోనే ”స్త్రీలను అణిచివేయాలనే దృక్పథంతోనే దుర్మార్గులు, స్వార్థపరు లైన స్మృతికారులు అన్యాయమైన, అసంబద్ధమైన విషయాలను చేర్చి ధర్మశాస్త్రాలు రాసారు” అనే విలువైన పరిశీలన చేసాడు.
కుటుంబం మారాలంటే స్త్రీ చదువు కోవాలని భావించిన ఫూలే 1848లో మొట్టమొదటి అతిశూద్ర బాలికల పాఠశాల ప్రారంభించాడు.ఆ రోజుల్లో ఆడవాళ్లు చదువుకోవడం నిషిద్ధం కాబట్టి మహిళా ఉపాధ్యాయులు అందుబాటులో లేరు. ఈ కారణంగా మొదట తన భార్య సావిత్రిభాయికి చదువు నేర్పి ఆమెతో ఆడపిల్లలకు చదువు చెప్పించాడు. ఆ రకంగా ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా సావిత్రీభాయి ఫూలే నిలిచింది.నిజానికి ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రీ భాయి పేరు మీద జరగాలి. కానీ, అగ్రవర్ణ భావజాలం గల మన నాయ కులు ఆమె సేవలను గుర్తించలేదు. ఇలాంటి కుట్రలు స్వయంగా ఆమె కార్యరంగంలో ఉన్నప్పుడు కూడా చేసారు.ఆమె చదువుచెప్పటానికి పాఠశాలకు వెళ్తుంటే ఓర్వలేని పండితులు ఆమె మీద పేడనీళ్లు చల్లేవారు, తిట్టేవారు, చంపుతామని బెదిరించేవారు. ఫూలే తండ్రి మీద ఒత్తిడి తెచ్చి జ్యోతిరావు దంపతులను ఇంట్లోనుంచి గెంటి వేయించారు. ఇవేవీ లెక్కచేయని ఫూలే శూద్ర, అతిశూద్ర బాలికలకోసం మరిన్ని పాఠశాలలు తెరిచాడు.
ఒకపక్క తాను స్వయంగా పాఠశాలలు నడుపుతూనే మరోపక్క కింది వర్గాల ప్రజల చదువు కోసం బ్రిటీష్ ప్రభుత్వం శ్రద్ధ వహించవల్సిందిగా కోరుతూ అనేక విజ్ఞాపన పత్రాలను సమర్పించేవాడు. రైతుల,కార్మికుల గురించి కూడా ఆనాటికి చాలా ముందుచూపుతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచేవాడు. ఈ క్రమంలోనే హంటర్ కమిషన్ కు తాను అందజేసిన మెమోరాండంలో ప్రాథమిక విద్యాప్రాధాన్యాన్ని అద్భుతంగా వివరించాడు. ”మాహార్లు, మాంగులు ఇతర వెనుకబడిన వర్గాలుగా ఉన్న బహుజనులు తమకోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కులతత్వంతో నిండిన వాళ్ల పాఠశాలల్లోకి రానివ్వరు” అని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసాడు.ఆయన కాలంలో సాంఘిక సంస్కర్తలమని చెప్పుకుతిరుగుతున్న చాలామంది చేయలేని ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు జ్యోతిరావుఫూలే ఒంటిచేతితో తన భార్య సావిత్రీ ఫూలే సహకారంతో చేసాడు.
ప్రజల్లో చైతన్యం తేవడానికి ఆనాటి అసమాన సాంఘిక నిర్మాణం మీద దాని నేపథ్యం మీద పరిశోధనాత్మక రచనలు చేసాడు. తన ఆదర్శాలను కేవలం తన రచనల్లోనే చెప్పి ఊరుకోలే దాయన.వాటిని తన జీవితంలో చేసి చూపించాడు. అట్టడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడు.అందుకే అంబేద్కర్ అంతటి మహామేధావికే గురుస్థానంలో నిలవగలిగాడు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరికీ చదువుకునే హక్కును ప్రసాదించటం ఫూలే ఆచరణకు కొనసాగింపు గానే చూడాలి. రాజ్యాంగంలో మానవతా దృష్టితో పొందుపరిచిన అనేక చట్టాల వెనుక ఆనాడు ఫూలే సాగించిన ఉద్యమ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఫూలే కృషి తదనంతరకాలంలో అంబేద్కర్ రూపంలో చాలా సమర్థవంతంగా కొనసాగింది.ఆ స్ఫూర్తి ఆనాడే కాదు, ఈనాటికీ కొనసాగుతూనే ఉంటుంది.
(నేడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి)
- టీ.ఆర్., 9676761415



