క్రీడాకారులు జాతీయ స్థాయిలో పేరోందాలి..
ఏపీ–తెలంగాణ 7వ క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభం
విజేతలకు నగదు బహుమతులు – వెలిచాల రాజేందర్ రావు హామీ
నవతెలంగాణ – కరీంనగర్
జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి దేశానికి పేరు తీసుకురావాలనే లక్ష్యంతో కబడ్డీ ఆటను కరీంనగర్ జిల్లాలో మరింత అభివృద్ధి చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. వారు శుక్రవారం కరీంనగర్ లోని వివేకానంద సీబీఎస్సీ హైస్కూల్లో ప్రారంభమైన ఏపీ–తెలంగాణ 7వ క్లస్టర్ కబడ్డీ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల నుండి ఘన స్వాగతం అందుకున్న రాజేందర్ రావు, టోర్నీ పతకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ… “కబడ్డీ అంటేనే కరీంనగర్ గుర్తొచ్చేలా చేస్తాం. జిల్లాను కబడ్డీ క్రీడాకారుల కేంద్రంగా తీర్చిదిద్దుతాం. శిక్షణా సదుపాయాలు, అవసరమైన వనరులు అందించేందుకు ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ సహకారం తీసుకుంటాం.” అని తెలిపారు. క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించడం గొప్ప క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. క్రీడలు శారీరక ధృఢతతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, విద్యార్థులు ప్రతి రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని సూచించారు. “నిత్యం సెల్‌ఫోన్ పట్టుకుని ఉండకూడదు” అని హెచ్చరించారు.
విజేతలకు నగదు బహుమతులకు హామీ
టోర్నమెంట్ విజేతలకు తన సొంతంగా నగదు బహుమతులు అందిస్తానని ప్రకటించిన రాజేందర్ రావు, ఈ ప్రకటనపై జిల్లా కబడ్డీ సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. వివేకానంద స్కూల్ జిల్లా తొలి సీబీఎస్సీ పాఠశాలగా 45 సంవత్సరాలుగా విద్యారంగంలో తనదైన ముద్ర వేసిందని చెప్పారు. ఈ పాఠశాలలో చదివినవారు దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నాడి అమిత్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్ రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌడ్, రిఫరీ బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ, సీబీఎస్సీ అబ్జర్వర్ లెంక వెంకటరమణ, స్కూల్ చైర్మన్ పోల్సాని సుధాకర్, డైరెక్టర్ లలిత కుమారి, ప్రిన్సిపాల్ రేణుక, ఇతర అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, 800 మంది కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ పోటీలు ఆదివారం వరకు కొనసాగనున్నాయి.