నవతెలంగాణ – ఆర్మూర్
ఈ అభ్యాస్ అకాడమీ తమ అనుబంధ పాఠశాలలతో కలిసి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న కే – సెట్ ఒలింపియాడ్ ప్రతిభా పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించినట్లు, మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ లో నిర్వహిస్తున్నామని ఈఅభ్యాస్ అకాడమీ ఛైర్మన్ డా. భువనగిరి ఫణి పవన్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్ష ప్రశ్నపత్రాలను ఆదివారం శేష తల్ప సాయి, స్పెషల్ జ్యూడిశియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ 2 క్లాస్, కాంతి హై స్కూల్ ఫౌండర్ కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి , డైరెక్టర్ శశాంక్ రెడ్డిలు విడుదల చేశారు.
ఈ పరీక్షను అకాడమీ రెండు దశల్లో నిర్వహిస్తున్నదని, తొలి దశను తెలంగాణ రాష్ట్రంలోని 275కు పైగా అనుబంధ పాఠశాలల్లో జనవరి 18న విజయవంతంగా నిర్వహించగా, సుమారు 25,000కు పైగా విద్యార్థులు పాల్గొన్నారని ఆయన వివరించారు. తొలి దశలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి నుండి 1, 2, 3 ర్యాంకులు సాధించిన 12,500కు పైగా విద్యార్థులకు రెండవ దశ ప్రతిభా పరీక్షను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా15కేంద్రాల్లోఏకకాలంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రెండవ దశలో రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి అవార్డ్ ఫంక్షన్‌ను 12వ అభ్యాసోత్సవ్ సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో నిర్వహించి, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు , నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఈ.అభ్యాస్ అకాడమీ తెలంగాణ సీఈఓ శ్రీ బి. మణికంఠ తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విశ్లేషణాత్మక నైపుణ్యం, తార్కిక ఆలోచనను ప్రోత్సహించడం లక్ష్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.



