– అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి
– రూ.200 కోట్ల నిధులు మంజూరు చేస్తా..
– త్వరలో గోదావరి, కృష్ణా పుష్కరాలు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– సరస్వతీ పుష్కరాలను ప్రారంభించిన సీఎం, మంత్రులు
నవతెలంగాణ-భూపాలపల్లి
కాళేశ్వరంను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, మంత్రి శ్రీధర్ బాబు అడిగిన రూ.100 కోట్లు కాకుండా రూ.200కోట్ల నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో సరస్వతీ పుష్కరాల ప్రారంభానికి గురువారం సాయంత్రం కాళేశ్వరం విచ్చేసిన ముఖ్యమంత్రి సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ సిటీని పరిశీలించారు. అనంతరం 17 అడుగుల ఏకశిలా సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల వసతి కోసం నిర్మించిన గదుల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు. సరస్వతి ఘాట్‌ను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సరస్వతి ఘాట్‌లో పుష్కరాలపై ప్రసంగించారు. రాష్ట్రంలో నదులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని సీఎం తెలిపారు. ప్రపంచంలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసిన పీవీ నరసింహారావు మంథని బిడ్డ అని అన్నారు. అ తదుపరి శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. మంథని నియోజక వర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడే శ్రీధర్ బాబు.. రాష్ట్రంలో లక్షల కోట్లు విదేశీ, స్వదేశీ పెట్టుబడులను పెట్టించడం, ప్రయివేట్ రంగంలో వేల కోట్ల పెట్టుబడులను తేవడం ద్వారా రాష్ట్రం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. త్వరలో జరగబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను, సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రీన్ ఛానల్‌లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల అధికారులను సీఎం అభినందించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాబోయే 11 రోజుల పాటు జరిగే పుష్కరాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. మాదవానంద సరస్వతి సూచన మేరకు దేవాలయాల పవిత్రను కాపాడాలని కోరారు. మారుమూల ప్రాంతమయిన కాళేశ్వరంను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. 20 ఏండ్లలో పెండింగ్‌లో ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సీఎం రావాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రూ.3కోట్లతో బస్టాండ్ నిర్మాణాన్ని చేసుకున్నట్టు తెలిపారు.
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దేశంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూస్తున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో వచ్చే గోదావరి, ప్రాణహిత, కృష్ణా పుష్కరాలు, మేడారం జాతరలనూ నిర్వహించుకోవాలని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇంత ఘనంగా సరస్వతీ పుష్కరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ వినరు క్రిష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యేలు మక్కడ్ ఠాకూర్, నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కాళేశ్వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES