ఈనెల 22లోగా నిర్ణయం
పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత : నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల పనులను పూర్తిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్, అలాగే కాళేశ్వరం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుంటూ, ఇంజినీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే విషయమై ఈనెల 22లోగా నిర్ణయిస్తామన్నారు. మైలారం నుంచి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 14 కిలోమీటర్ల సొరంగం ద్వారా సుందిళ్ల నీరు తరలిస్తామని చెప్పారు.
మరో మార్గం ప్రకారం మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి యెల్లంపల్లి ద్వారా నీటిని మళ్లీంచడం జరుగుతుందని వివరించారు. ఈ రెండు ప్రత్యామ్నాయాల ఖర్చు, హైడ్రాలిక్ సామర్థ్యం, భౌగోళిక అనుకూలత విద్యుత్ అవసరాలపై సమీక్షించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుర్తు చేశారు. భూగర్భ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తెలంగాణ నీటి పారుదల నిర్మాణంలో కీలక భాగమన్నారు. ఇది శ్రీశైలం జలాశయాన్ని కరువు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూములకు కృష్ణానదీ జలాలను అందించడానికి రూపొందించబడిందని చెప్పారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను తొలగిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్‌ఏ నివేదిక ప్రకారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సంస్థలు, నిపుణ సంస్థలను పునరుద్ధరణ పనుల్లో పాల్గొనాలని కోరినట్టు చెప్పారు.
ప్రముఖ ఐఐటీ ప్రధాన సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. ఇది తెలంగాణ నీటి పారుదల శాఖకు చెందిన చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)తో కలిసి పని చేస్తుందని వివరించారు. ప్రధాన ఐఐటీ బందం నిర్మాణ రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుందన్నారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు. పునరుద్ధరణ ప్రక్రియ ఎన్డీఎస్‌ఏ సిఫారసులకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఏదైనా వ్యత్యాసం వచ్చినా, ఆలస్యం జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. వారానికి ఒకసారి పురోగతి సమీక్షలు నిర్వహించి సాంకేతిక ఫలితాలను పద్ధతిగా నమోదు చేయాలని ఆదేశించారు. ‘ఈ బ్యారేజీల భద్రత అత్యంత ప్రాధాన్యమైనది. ప్రతి దశలో జాతీయ స్థాయి సంస్థలు పాల్గొంటూ శాస్త్రీయ, పారదర్శక, సవరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నామని’ ఆయన తెలిపారు. న్యాయపరమైన అంశాల పరంగా కష్ణా జలవివాదాల ట్రిబ్యునల్- కెడబ్ల్యూడీటీ ముందు జరుగుతున్న విచారణ పురోగతిని సమీక్షించారు.
సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారనీ, ఆంధ్రప్రదేశ్ తమ వాదనలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలనీ, ఢిల్లీలోని న్యాయ బృందంతో రాష్ట్ర, సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని చెప్పారు. వాదనల్లో ఏకరూపత ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమ్మక్క-సరక్క ప్రాజెక్టు పురోగతిని కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ను సంప్రదించి నీటి కేటాయింపు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఆమోదం కోరిందని తెలిపారు. సీతమ్మసాగర్, మొండికుంటవాగు, చనాక-కోరాట పంపిణీ వ్యవస్థలు చిన కాళేశ్వరం ప్రాజెక్టుల పెట్టుబడి ఆమోద దరఖాస్తులు కేంద్రానికి సమర్పించామన్నారు. ”కేంద్రం ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్టులు గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతాయని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు శాఖ ప్రధాన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటని గుర్తు చేశారు.
ప్యాకేజీ-6, అదనపు మూడవ దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు. భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా కార్యనిర్వాహక సామర్థ్యాన్ని ఈ ప్రభుత్వ కాలంలోనే చేరుకుంటుందని తెలిపారు. ‘దేవాదుల ప్రాజెక్టు గణనీయమైన భౌతిక పురోగతి సాధించిందనీ, త్వరలోనే భూస్థాయి ఫలితాలను ఇస్తుంది’ అని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షా నివేదిక సిద్ధం చేయాలనీ, ఇందులో భౌతిక పురోగతి, నిధుల వినియోగం పెండింగ్ పనులు ఉండాలని ఆదేశించారు. ఈ నివేదిక మూడు రోజులలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నీటి పారుదల రిజర్వాయర్ల మట్టిని తొలగించడం, అవక్షేపాలను తొలగించడంపై ముసాయిదా విధానాన్ని సమీక్షించారు. ఈ ప్రతిపాదన అదనపు ప్రభుత్వ వ్యయం లేకుండా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచే స్వయం సమర్థ విధానాన్ని రూపొందించడమే లక్ష్యమని తెలిపారు.