Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంత్వరలో కాళేశ్వరం విచారణ పూర్తి

త్వరలో కాళేశ్వరం విచారణ పూర్తి

- Advertisement -

– మూడో వారంలో సర్కారుకు నివేదిక ?
– కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటలకు నోటీసుల్లేవు!?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు విఫలంపై సర్కారు నియమించిన న్యాయ విచారణ త్వరలో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రిటైర్డ్‌ జడ్జి పీసీ ఘోష్‌ దాదాపు గత ఏడాది కాలంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పగుళ్లు, సీపేజీలు, ప్లానింగ్‌, డిజైన్లు, డ్రాయింగ్‌లతోపా టు అవకతవకలు తదితర అంశాలపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 100 మందికిపైగా అధికారులు, ఇంజినీర్లు, వర్కింగ్‌ ఏజెన్సీలను విచారించారు. బహిరంగ విచారణకు పిలిచారు. ప్రశ్నలేశారు. అఫిడవిట్లు తీసుకున్నారు. కొంత మంది డ్రాప్‌ బాక్స్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. మరికొందరు నేరుగా జడ్జిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఇదిలావుండగా కమిషన్‌ విచారణ గడువు ఈనెల 31తో ముగియనుంది. మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారిక సమాచారం. దీంతో జడ్జి పీసీ ఘోష్‌ వేగంగా విచారణను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా కాళేశ్వరం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ తదితరులకు సైతం నోటీసులు ఇస్తారని విచారణ క్రమంలో అందరూ భావించారు. అయితే అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదని తెలిసింది. కాగ్‌, విజిలెన్స్‌, ఎన్డీఎస్‌ఏ నివేదికలను కూడా కమిషన్‌ పరిశీలించింది. ప్రభుత్వానికి అందజేయాల్సిన నివేదిక జస్టిస్‌ ఘోష్‌ ఇప్పటికే రూపొందించినట్టు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రక్రియను ఒకసారి సమీక్ష చేసుకుని, ఆ నివేదికకు తుదిమెరుగులు దిద్దేపనిలో జస్టీస్‌ ఘోష్‌ ఉన్నట్టు బీఆర్‌ఆర్‌కే భవన్‌లోని కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు ఉత్పన్నం కాకపోతే ఈనెల మూడో వారంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని స్వయంగా కలిసి నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరం న్యాయవిచారణ నివేదిక చాలా స్పష్టంగా వచ్చే పరిస్థితి ఉందని తెలిసింది. అన్నీ అంశాలను పరిశీలించిన అనంతరం, అవినీతి అవకతవకలను కుండబద్దలు కొట్టేలా నివేదిక ఉంటుందని సమాచారం. మాజీ, తాజా అధికారులు స్టేట్‌మెంట్లు, అఫిడవిట్ల సమాచారమే ఇందుకు ఉపయోగించుకుని నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచే తప్పిదాలు దొర్లినట్టు జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికలో పొందుపరిచారని సమాచారం. రూ. లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టి మూడేండ్లకే కుప్పకూలిన నేపథ్యంలో ఎవరు బాధ్యులు కానున్నారో ఈ నెలాఖరులోగా తేలనుంది. కమిషన్‌కు జ్యుడీషియల్‌ అధికారాలు కల్పించిన నేపథ్యంలో ఆ నివేదిక అధారంగా అధికారులు, రాజకీయ నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -