Saturday, August 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసర్కారుకు కాళేశ్వరం నివేదిక

సర్కారుకు కాళేశ్వరం నివేదిక

- Advertisement -

రెండు సీల్డ్‌ కవర్లల్లో
ముఖ్యకార్యదర్శి రాహుల్‌బొజ్జాకు చైర్మెన్‌ ఘోష్‌ అందజేత
లాకర్‌లో భద్రపరిచిన అధికారులు
సంచలన విషయాలు వెలుగులోకి ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. ఈమేరకు చైర్మెన్‌ పీసీ ఘోష్‌ గురువారం 650 పేజీలతో కూడిన తుది నివేదికను రెండు సీల్డ్‌ కవర్లల్లో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అందజేశారు. రాహుల్‌బొజ్జా వెంటనే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావుకు ఇచ్చారు. ఈ నివేదికను సీఎస్‌ కార్యాలయంలోని లాకర్‌లో భద్రపరిచినట్టు తెలిసింది. ఇదిలావుండగా గత బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, మిగతా బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు తలెత్తడంపై విజిలెన్స్‌ విచారణతోపాటు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ)తో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్టు విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయవిచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వెంటనే కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి అయిన పీసీ ఘోష్‌ను నియమించారు. ఆయన 2019 నుంచి 2022 వరకు భారతదేశ మొదటి లోక్‌పాల్‌గా పనిచేసిన విషయం విదితమే. గత 2024, మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ దాదాపు 15 నెలలపాటు 115 మందిని విచారించింది. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్‌, డిజైన్లను పరిశీలించిన కమిషన్‌, విజిలెన్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారించింది. ఇందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కూడా కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసింది. అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇలా మొత్తం 115 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. అఫిడవిట్లు, వాంగ్మూలాలను విశ్లేషించి తుది నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పించింది. కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరడంతో అందులో ఏముందనే విషయమై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదిక నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సంచలనాలు వెలుగులోకి ….
కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరడంతో వచ్చే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలున్నాయి. కమిషన్‌ మాజీ సీఎంను, మాజీ మంత్రులను, మాజీ ఉన్నతాధికారులను విచారించిన నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందనీ, లోపాలు తీవ్రంగా ఉన్నాయని ఇప్పటికే విజిలెన్స్‌ నివేదికలో స్పష్టమైన విషయం విదితమే. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక సైతం నిధుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించలేదనే వ్యాఖ్యానాలు చేసిన సంగతి తెలిసిందే. బ్యారేజీల నిర్మాణంలో అవినీతి జరిగిందా ? వాటి భవిష్యత్తు ఏంటి? తదితర అంశాల విషయంలో నివేదిక ఏదైనా చెబుతుందా ? లేదా ? అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు మనగలుగుతుందా ? లేదా ? అనేది చెప్పలేమని ఇప్పటికే ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేర్కొన్నది. ఈనేపథ్యంలో పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక రాష్ట్రంలో సంచలనాలు సృష్టించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -