నవతెలంగాణ – కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొత్తపెళ్లి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ ఎండిపోయిన నేపథ్యంలో, రైతుల పంటల్ని వదిలి నాయకులు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు. కాలువలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నాయకత్వం వహించగా, కాలువలో నీరు లేకపోవడాన్ని జీవనాధారమైన సాగునీటిని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం ద్వారా దిగువ జలాలను ఎగువకు మళ్లించి, ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరదకాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకూ నీటిని తరలించారని గుర్తు చేశారు.
అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేయకుండా జలాలను వృథా చేస్తున్నదని ఆరోపించారు. నీరు ఇవ్వగల సాంకేతిక వసతి ఉండి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. త్రాగునీరు, సాగునీటి కోసం రైతులు కష్టపడుతున్నారు. ఇది రైతు వ్యతిరేక పాలనకు నిదర్శనం” అని మండిపడ్డారు.
నాలుగు రోజులు గడువు .. లేకపోతే రైతులతో భారీ ఉద్యమం
బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు రోజుల గడువు నిచ్చారు. అప్పటిలోగా కాలువలకు నీరు వదిలి రైతులకు అందించకపోతే, పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. “రైతు జీవనాధారాలను విస్మరిస్తే ఊరుకోం,” అని సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ జడ్పిటిసిలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.