Friday, May 30, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా కల్కి

గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా కల్కి

- Advertisement -

– ఉత్తమ నటుడు : అల్లుఅర్జున్‌, ఉత్తమ నటి : నివేదా థామస్‌, ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులలో 2024 సంవత్సరానికి తొలి ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’ చిత్రం నిలిచింది. ఉత్తమ నటుడిగా ‘పుష్ప2′ చిత్రానికి అల్లుఅర్జున్‌, ఉత్తమ నటిగా ’35 చిన్న కథ కాదు’ చిత్రానికి నివేదాథామస్‌ ఎంపికవ్వగా, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898ఏడీ) అవార్డును దక్కించుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల విజేతల వివరాలను గురువారం జ్యూరీ చైర్‌పర్సన్‌ జయసుధ ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా, వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, ‘కొత్తవారికి, చిన్న సినిమాలకు తగిన గౌరవం దక్కిందని భావిస్తున్నాను. ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. ఈ అవార్డుల ఎంపికలో కమిటీ సభ్యులు ఎంతగానో సహకరించారు. అవార్డుల కోసం ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. అలాగే నవతరం దర్శకులు చక్కటి కథలను ఎంపిక చేసుకోవడం అభినందనీయం’ అని అన్నారు.
‘కల్కి’, ‘లక్కీభాస్కర్‌’కు అవార్డుల పంట
ప్రభాస్‌ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. తొలి ఉత్తమ చిత్రం అవార్డును ఈ సినిమా పొందింది. అలానే ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు. ఇదే చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ అద్నితిన్‌ జిహానీ చౌదరి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అర్చనా రావ్‌, అజరు కుమార్‌ అవార్డ్స్‌ దక్కించుకున్నారు. గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో నాలుగు అవార్డులు అందుకున్న మరో చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. ఈ సినిమా తతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలానే ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే సమకూర్చిన వెంకీ అట్లూరి బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదే చిత్రానికి ఎడిటర్‌ నవీన్‌ నూలికి అవార్డు లభించింది. హీరో దుల్కర్‌ సల్మాన్‌ను స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపిక చేశారు.
2014 జూన్‌ నుంచి 2023 డిసెంబర్‌ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డును ఇవ్వనున్నారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. మురళీమోహన్‌ జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్న ఈ అవార్డులను త్వరలోనే ప్రకటిస్తామని దిల్‌ రాజు తెలిపారు.
గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులతో పాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, పైడి జయరాజ్‌ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి – చక్రపాణి, టి.ఎల్‌. కాంతారావు అవార్డులను కూడా ప్రకటించాల్సి ఉంది. వాటిని కూడా త్వరలో ప్రకటించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ అవార్డు ప్రదానోత్సవం జూన్‌ 14న జరుపనున్నారు.
ఈ అవార్డులు మా బాధ్యతని పెంచాయి
ఉత్తమ చిత్రంగా ‘కల్కి’ అవార్డును సొంతం చేసుకుంది. దీనిపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ స్పందిస్తూ, ఈ అవార్డులు మా బాధ్యతని పెంచాయి. చిత్ర బృందాన్ని ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉత్తమ పరిచయ దర్శకుడిగా ‘కమిటీ కుర్రోళ్ళ’కుగాను యదు వంశీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘కమిటీ కుర్రోళ్ళ టీమ్‌కు ఇదొక మైలురాయి. మా శ్రమను గుర్తించిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు’ తెలిపింది.
ఇక ‘ఆరు’ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఈ గుర్తింపు మా గౌరవాన్ని మరింతగా పెంచింది. ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమని జీఏ2 నిర్మాణ సంస్థ పేర్కొంది.

తొలిసారి ప్రకటించిన ‘గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024’లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికవ్వడం నాకు దక్కిన నిజమైన గౌరవం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రశంసలన్నీ దర్శకుడు సుకుమార్‌, చిత్ర నిర్మాతలు, మొత్తం ‘పుష్ప2’ టీమ్‌కు దక్కుతాయి. ఈ అవార్డును నా అభిమా నులకు అంకితం చేస్తున్నా. మీరు అందిస్తున్న సహకారం ప్రతిసారి నాలో స్ఫూర్తినింపుతుంది.
– అల్లు అర్జున్‌


గద్దర్‌ ఫిల్మ్‌ 2024 అవార్డుల విజేతల వివరాలు
మొదటి ఉత్తమ చిత్రం :
కల్కి 2898ఏడీ
రెండో ఉత్తమ చిత్రం : పొట్టేల్‌
మూడో ఉత్తమ చిత్రం : లక్కీ భాస్కర్‌
ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్న కథ కాదు
హిస్టరీ – హెరిటేజ్‌ : రజాకార్‌
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం : ఆరు
ఉత్తమ పరిచయ దర్శకుడు : యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌.జే.సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి : శరణ్యా ప్రదీప్‌ (అంబాజీ పేట మ్యారేజ్‌ బ్యాండ్‌)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (లేదే లేదే ప్రేమసలే)
ఉత్తమ సంగీత దర్శకుడు : భీమ్స్‌ (రజాకార్‌)
ఉత్తమ నేపథ్య గాయకుడు : సిద్ద్‌ శ్రీరామ్‌ (నిజమే నే చెబుతున్నా)
ఉత్తమ నేపథ్యగాయని : శ్రేయా ఘోషల్‌ (సూసేకి అగ్గిరవ్వ – పుష్ప 2)
ఉత్తమ హాస్యనటుడు : సత్య, వెన్నెలకిషోర్‌ (మత్తువదలరా 2)
ఉత్తమ బాలనటుడు : అరుణ్‌ దేవ్‌ పోతుల (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌)
ఉత్తమ కథా రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : వెంకీ అట్లూరి (లక్కీభాస్కర్‌)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : విశ్వనాథ్‌ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్‌ : నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)
ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ : అరవింద్‌ మీనన్‌ (గామి)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణేశ్‌ ఆచార్య (ఆయుధపూజ – దేవర)
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌ : ఆద్నిజిత్‌ జిహాని చౌదరి (కల్కి 2898ఏడీ)
ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ : కె.చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)
ఉత్తమ మేకప్‌ : నల్లశ్రీను (రజాకార్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : అర్చనారావు, అజరు కుమార్‌ (కల్కి)
స్పెషల్‌ జ్యూరీ అవార్డులు
ఉత్తమ నటుడు :
దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీభాస్కర్‌)
ఉత్తమ నటి : అనన్య నాగళ్ళ (పొట్టేల్‌)
ఉత్తమ దర్శకులు : సుజీత్‌, సందీప్‌ (క)
ఉత్తమ నిర్మాతలు : ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి (రాజు యాదవ్‌)
స్పెషల్‌ జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం : మన సినిమా ఫస్ట్‌ రీల్‌ (రెంటాల జయదేవ్‌)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -