Wednesday, December 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునష్టాల ఊబిలో కల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ

నష్టాల ఊబిలో కల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ

- Advertisement -

– ప్రభుత్వం ఆదుకోకుంటే మనుగడ ప్రశ్నార్థకం
– 4 లక్షల టన్నుల నుంచి రూ.21వేలకు పడిపోయిన క్రషింగ్‌
– వరి, పామాయిల్‌ పంటలపైనే రైతుల దృష్టి
– పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర ఉండాలి
– ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన ఆరు ఫ్యాక్టరీలు
నవతెలంగాణ – కల్లూరు

ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో సాగైన చెరుకు, ప్రస్తుతం కేవలం 754 ఎకరాలకు పడిపోయింది. సరైన ప్రోత్సాహకం, మద్దతు ధరలు లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. గత కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగు లక్షల టన్నుల వరకు క్రషింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న కల్లూరు మండలంలోని కాకతీయ షుగర్‌ ఫ్యాక్టరీ, 2025-26 సీజన్‌లో కేవలం 21,500 టన్నుల చెరుకు క్రషింగ్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అందులో ప్రధానమైనది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ. ఆ తర్వాత జగిత్యాలలోని ముత్యంపేట, మెదక్‌లోని ముంబోజిపల్లిలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మిగతావి ప్రయివేటు ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాకతీయ షుగర్‌ ఫ్యాక్టరీ రోజుకు 3,200 టన్నుల చెరుకు క్రషింగ్‌ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఫ్యాక్టరీ ప్రారంభ దశలో చెరుకు సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఒకసారి సాగు చేస్తే మూడు పంటలు తీసుకునే అవకాశం ఉండటం, చెరుకు దిగుబడులు అధికంగా రావడం వల్ల రైతులు ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందేవారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పడింది. దాంతో చుట్టుపక్కల మండలాలతోపాటు అశ్వరావుపేట, భద్రాచలం, తల్లాడ, వైరా, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చెరుకు సాగు విస్తరించింది. సుమారు 20 వేల ఎకరాల్లో చెరుకు సాగు జరిగేది. ఫలితంగా ఫ్యాక్టరీ ప్రారంభించిన రెండు-మూడు సంవత్సరాల్లోనే సుమారు నాలుగు లక్షల టన్నుల చెరుకు క్రషింగ్‌ జరిగేది. ఫ్యాక్టరీ సుమారు మూడు నుంచి నాలుగు నెలలపాటు నిరంతరంగా నడిచేది. దీంతో ప్రత్యక్షంగా-పరోక్షంగా సీజనల్‌ కార్మికులకు ఉపాధి లభించేంది.

చెరుకు సాగు ఇలా తగ్గింది
సాగునీటి సమస్యలు, కోతుల బెడద, పెరిగిన పెట్టుబడులు, తగిన మద్దతు ధర లేకపోవడం వల్ల చెరుకు సాగు లాభదాయకంగా లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం టన్ను చెరుకు ధర సబ్సిడీతో కలిపి సుమారు రూ.3,500 మాత్రమే ఉండగా, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. వరి పంటకు బోనస్‌, పామాయిల్‌ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడంతో ఆ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

చెరుకు సాగు లాభాలు
ఇతర పంటలతో పోలిస్తే చెరుకు సాగుకు స్పష్టమైన లాభాలు ఉన్నాయి. ఒకసారి నాటితే మూడు పంటలు (మూల చెరుకు, మొదటి రాటూన్‌, రెండో రాటూన్‌) తీసుకునే అవకాశం ఉండటంతో, ఎకరానికి ఏడాదికి సగటున రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే, చెరుకు ధర ఫ్యాక్టరీ నిర్ణయంతో స్థిరంగా ఉండటం వల్ల వరి, మిర్చి, పత్తి, పామాయిల్‌ వంటి పంటల మాదిరిగా ధరల హెచ్చుతగ్గులు ఉండవని రైతులు చెబుతున్నారు.

ఆటుపోట్లు తట్టుకునే చెరుకు సాగు
పంటల సాగు, ధరల్లో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవాలంటే చెరుకు సాగు ఉపయోగకరంగా ఉంది. ధరలో ఎలాంటి హెచ్చుతగ్గులూ ఉండవు కాబట్టి రైతుకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఫ్యాక్టరీ నిర్ణయించిన ధరకు తగ్గించకుండా నిలకడగా ఉంటుందని కొంత చెరుకు సాగు చేస్తే.. ఇటు ఫ్యాక్టరీ అటు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. చెరుకు సాగు వల్ల రైతుకు ఆర్థిక స్థిరత్వం లభించడంతో పాటు, ఫ్యాక్టరీ నిరంతరం నడవడంతో ప్రత్యక్షంగా-పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర పెంపు, చెరుకు సాగుకు బోనస్‌, సబ్సిడీతో సోలార్‌ ఫెన్సింగ్‌, యాంత్రీకరణకు ప్రోత్సాహం వంటి చర్యలు చేపడితే రైతులు మళ్లీ చెరుకు సాగు వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. లేకపోతే మూతపడిన ఫ్యాక్టరీల పరిస్థితి లాగానే కల్లూరు షుగర్‌ ఫ్యాక్టరీ మారే ప్రమాదం ఉంది. బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెలిపిస్తామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు ఆశలు కల్పించింది. దాని ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక అందించినా ముందుకు సాగడం లేదు. ఉన్న ఫ్యాక్టరీలను అయినా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

మద్దతు ధర రూ.4000, బోనస్‌ రూ.1000 ఇవ్వాలి
షుగర్‌ ఫ్యాక్టరీలు నిరంతరం నడవాలంటే టన్ను చెరుకుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర రూ.4వేలు, బోనస్‌ కింద రూ.1000 చెల్లిస్తేనే రైతులు సాగు వైపు వెళ్తారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉండగా 6 మూతపడ్డాయి. ప్రస్తుతం ఐదు షుగర్‌ ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తుండగా అవి కూడా 20 నుంచి 30,000 టన్నులోపే క్రషింగ్‌ చేస్తున్నాయి. షుగర్‌ ఫ్యాక్టరీలు నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధిక దిగుబడి వంగడాలను పరిశోధన చేసి రైతుకు తగినంత ప్రోత్సాహం ఇవ్వాలి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎకరాకు 60 నుంచి 70 టన్నుల దిగుబడి వస్తుండగా, మన దగ్గర 30 నుంచి 40 టన్నులు మాత్రమే దిగుబడి వస్తుంది. దిగుబడి కూడా తగ్గిపోవడంతో రైతులు గిట్టుబాటుగాక చెరుకు సాగుకు దూరమవుతున్నారు. రాష్ట్రంలో చెరుకు వంగడం పరిశోధన కేంద్రం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలి. వైరా రిజర్వాయర్‌ నీటి సౌకర్యం ఉంది. ఆ వైపు దృష్టి పెడితే షుగర్‌ ఫ్యాక్టరీలు నడుస్తాయి. అవి మూతపడితే వేలాదిమంది కార్మికుల జీవితాలు రోడ్డు పాలు అవుతాయి.
– చెరుకు రైతు సంఘం
రాష్ట్ర కార్యదర్శి బొంతు రాంబాబు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -