నవతెలంగాణ – అశ్వారావుపేట
బతికుండగా తన సాహిత్యంతో తెలంగాణ ఉనికిని ఉద్యమ రూపంగా మార్చిన కాళోజి మృతి చెందిన తర్వాత సైతం తన శరీరాన్ని వైద్య విద్యార్ధుల ప్రయోగార్ధం సమాజానికే అంకితం చేసిన మహోన్నతుడు కాళోజీ అని పలువురు ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణా తొలి పొద్దు అని,ప్రజల గొడవ తీర్చడం కోసమే ఆయన జీవితాన్ని ధార పోసారు అని తెలిపారు. మండలంలో తహశీల్దార్,మండల పరిషత్,మున్సిపాల్టీ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం కాళోజి జయంతి ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,కమీషనర్ నాగరాజు,ప్రధానోపాధ్యాయులు హరిత లు మాట్లాడుతూ దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లో నూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 1980 ల వరకు రకరకాల ప్రజా ఉద్యమాలలో ఆయన గొంతు వినిపించారని అన్నారు. చనిపోయిన తరువాత కూడా పదిమందికి ఉపయోగపడాలి అన్న ఆశయంతో ఆయన శరీరాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థులకు ప్రయోగాల కోసం దానం చేశారు అని కొనియాడారు.కాళోజి కన్న కలలు సాకారం కావడానకి భావి పౌరులు శ్రమించాలని, తెలంగాణాకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది, భాషోపాధ్యాయులు,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధులు సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.