Tuesday, January 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామని.. ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్లకవిత అన్నారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నట్టు తెలిపారు. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

‘‘బీఆర్‌ఎస్‌లో ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశా. పార్టీలో ప్రశ్నించడం వలనే నాపై కక్షగట్టారు. అక్కడే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు నాకు కనీసం అండగా నిలవలేదు. జాతీయ స్థాయిలో నేను బీజేపీపై పోరాటం చేశాను. దానితో పాటు కేసీఆర్‌పై ఉన్న కక్షతోనే బీజేపీ నన్ను జైలులో పెట్టించింది.

పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగింది. ఒక్క వర్షానికే సిద్దిపేటలో కలెక్టరేట్‌ కొట్టుకుపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీలో కోరాను. అమరవీరులను బీఆర్‌ఎస్‌ ఎప్పుడూ గుర్తించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనూ పట్టించుకోలేదు.

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగాను. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కేసీఆర్‌ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగా. కాళేశ్వరం విషయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై పార్టీలో ఉన్న ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడలేదు. అందుకే ప్రెస్‌మీట్‌ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేరు చెప్పాను. తెల్లారేపాటికి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.’’ అని కవిత ఆవేదనతో అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -