Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాజ్యసభకు కమల్‌ హాసన్‌

రాజ్యసభకు కమల్‌ హాసన్‌

- Advertisement -

– ఎంఎన్‌ఎం చీఫ్‌కు సీటు కేటాయించిన డీఎంకే
– గత లోక్‌సభ ఎన్నికల్లోనే ఇరు పార్టీల మధ్య ఒప్పందం
చెన్నై:
ప్రముఖ నటుడు , మక్కల్‌ నీది మయం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ త్వరలో రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్‌ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. ఈ విషయాన్ని డీఎంకే-ఎంఎన్‌ఎం ఖరారు చేశాయి. ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఆరు, అసోంలో రెండు సీట్లు వీటిల్లో ఉన్నాయి. తమిళనాడుకు చెందిన అన్బుమణి రామదాస్‌, ఎం. షణ్ముగమ్‌, ఎన్‌. చంద్రశేగరన్‌, ఎం.మహమ్మద్‌ అబ్దుల్లా, పి.విల్సన్‌, వైగో ఎగువసభ పదవీకాలం జులై 25తో ముగిసింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో నాలుగు స్థానాలనూ ఆ పార్టీనే దక్కించుకుంటుందని తెలుస్తోంది.
ఇండియా బ్లాక్‌లో ఎంఎన్‌ఎం భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. కమల్‌ హాసన్‌ 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించిన విషయం విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే చేతిలో ఓటమిపాలై అన్నాడీఎంకే ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీ ఒక్క రాజ్యసభ ఎంపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరో అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని భావిస్తే అన్నాడీఎంకే.. మిత్రపక్షం బీజేపీ, పీఎంకే ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రముఖ సినీ నటుడు విజరు కొత్త పార్టీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad