భారతీయ సాంస్కృతిక వికాసంపై చెరగని సంతకం
స్వాతంత్రానంతరం భారతీయ గ్రామీణ జానపద కళలు, సంస్కృతి సాంప్రదాయ నృత్య సంగీత నాటకాల వికాసానికి ఆహారహరం కృషిచేసి జీవితమంతా భారతీయ కళారంగానికి సేవ చేసిన మహామానుషి కమలాదేవి చటోపాధ్యాయ. సంగీతం, నాట్యం, నటన, సినిమాలు,కళల పునర్వికాసం ఇవే తన జీవన లక్ష్యంగా బతికిన కమలాదేవి చటోపాధ్యాయకు మన తెలంగాణ మెట్టినిల్లు. కాలం కాటు వేసి బాల వితంతువుగా మారిస్తే, ఆదర్శవాదిగా కనిపించే పురుషుడు కూడా ఆమెను మోసం చేశాడు. వీటికి తోడు సేవాభావంతో భారతీయ సాంస్కృతిక రంగానికి చేసిన కృషిలో కూడా రాజకీయాల వల్ల ఆమెకు అవమానాలే ఎదురైనవి. అలాంటి కమలాదేవి జీవితంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం.
కమలాదేవి ఛటోపాధ్యాయ 1903 ఏప్రిల్ 3న మంగుళూరులో జన్మించింది. తండ్రి అనంతయ్య ధరేశ్వర్ మంగళూరు జిల్లా కలెక్టరుగా పని చేసేవాడు తల్లి గిరిజాబాయి ఆ కాలంలోనే ఉన్నత విద్యావంతురాలు. ఆమె అమ్మమ్మ కూడా ఆధునిక అభ్యుదయ భావజాలంతో కూడిన విద్యావంతురాలుగా పేరున్న కుటుంబం వారిది.కమలాదేవి సేయింట్ అన్నె కాన్వెంటులో చదివింది. ఐతే కమలాదేవికి చిన్న వయసులోనే వరుస విషాదాలు ఎదురయ్యాయి. మొదట ఆమె ఆదర్శంగా భావించిన ఆమె అక్క సుగుణ, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని మరణించింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, ఆమె తండ్రి కూడా కన్నుమూశారు. ఈ విషాదానికి తోడు, ఆయన తన ఆస్తిని తన భార్యకు, జీవించి ఉన్న కుమార్తెకు గాని, మరోవైపు తన మొదటి భార్య కుమారునికి గాని వీలునామా రాయలేదు. అందువల్ల, అప్పటి చట్టం ప్రకారం, మొదటి భార్య కొడుకు ఆస్తికి వారసుడయ్యాడు.
ఈ అగమ్యగోచర స్థితిలో, ఆమె తల్లి కమలాదేవి ఇంకా హైస్కూల్లో చదువుతుండగానే, 1917లో పద్నాలుగేళ్ల వయసులో కృష్ణారావుతో ఆమెకు పెళ్లి జరిపించారు. తన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు, తండ్రి లేని ఆ యువతిని ఒంటరిగా పెంచడానికి ఆమె సంకోచించింది. అయితే కమలాదేవి భర్త పెళ్ళైన ఏడాదిలోపే మరణించారు. దాంతో 15 ఏళ్ల కమలాదేవి వితంతువు అయ్యింది. ఆమె మామగారు ఉదార స్వభావంతో కమలాదేవి తన చదువును కొనసాగించడానికి వీలు కల్పించడమే కాకుండా, తిరిగి వివాహం చేసుకోమని కూడా సలహా ఇచ్చారు. ఇదే ఆమె జీవితానికి మొదటి సానుకూల మలుపునిచ్చింది. చెన్నైలోని క్వీన్ వేర్ ఇస్ కాలేజీలో చదువుతున్నప్పుడు సరోజినీ నాయుడు చెల్లెలు సుహాసిని ద్వారా ఆమె సోదరుడు యువకుడు తెలివైనవాడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయతో ఆమెకు పరిచయం కలిగింది. హరిన్తో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడటానికి కొంత కాలమే పట్టింది.
హరిన్ చాలా ఉత్సాహవంతుడు, అందగాడు, పైగా నట గాయకుడు కూడా. అతి త్వరలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కమలాదేవికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి, ఆమె హరిన్ను పెళ్లి చేసుకుంది. వారిద్దరికీ కళల పట్ల, నాటకరంగం, సంగీతం పట్ల ఉమ్మడి ఆసక్తులు ఉండేవి. వారు కలిసి నాటకాలు, స్క్రిట్లు కూడా ప్రదర్శించేవారు. తమదైన విభిన్న మార్గాలలో అత్యంత ఆకర్షణీయంగా, బహుముఖ ప్రజ్ఞతో, ప్రతిభావంతులుగా, బహిర్ముఖులుగా ఉండే వారి దాంపత్యానికి గుర్తుగా ఏడాదిలోపే కుమారుడు రాము జన్మించాడు. మానవ సహజమైన దురాశ వల్ల హరిన్-కమలాదేవిల వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. తమ కుమారుడిని చూసుకోవడానికి కమలాదేవి నియమించిన ఒక ఒంటరి స్త్రీతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన కమలాదేవి హరిన్తో కలిసి జీవించలేక సామరస్యంగానే విడిపోయింది.
ఈ సంఘటనతో మగవాడు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మగవాడిగానే ప్రవర్తిస్తాడన్న విషయం మనకు ఇక్కడ రుజువవుతుంది. అండన్ యూనివర్సిటీకి చెందిన బెడ్ఫోర్డ్ కాలేజీ నుండి సోషియాలజీలో డిప్లమా పొందిన కమల ఆలిండియా వుమెన్స్ కాన్దరెన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. దేశంలో నాటకరంగ అభివద్ధికి విశేష కృషి చేసింది. సొంతంగా ఒక నాటక సమాజాన్ని నెలకొల్పి దేశమంతటా ప్రదర్శనలు ఇచ్చి థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ వికాసానికి ఎంతగానో శ్రమించింది. భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న కమలాదేవి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మెంబరు. మహాత్మాగాంధి, నెహ్రూలతో అత్యంత సాన్నిహిత్యం గల చటోపాధ్యాయ స్వాతంత్య్రోద్యమంలో వుమెన్స్ వలంటీర్ కార్ప్స్ (సేవాదళ్)కు కమాండర్ ఇన్ఛార్జిగా పనిచేసింది. మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజిలో ఉప్పును అమ్మి అరెస్టు అయింది. జైలు శిక్ష అనుభవించింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రథమ మహిళ.
దేశంతో సహకార వ్యవస్థ ఆవిర్భావానికి, ఉన్నతికి ఆమె కృషి చేసింది. పట్టణ, గ్రామీణ కో-ఆపరేటివ్ యూనియన్ల ఏర్పాటుకు గాను ఇండియన్ కో-ఆపరేటివ్ యూనియన్ స్థాపించి దాని అధ్యక్షురాలుగా ఎంతో కృషి చేసింది. హస్తకళలు, కుటీర పరిశ్రమల అభివద్ధికి ఎనలేని సేవలు అందించారీమె. ఢిల్లీ వద్ద గల ఫరీదాబాద్‌లో శరణార్థులచే ఒక పట్టణాన్ని నిర్మింపజేసివ ఘనత ఈమెకే దక్కుతుంది. బాల్య వివాహ నిరోధక చట్టం ‘శారదా చట్టం’గా ఒప్పందడానికి కమలాదేవి అనుసరించిన విధానం ద్విముఖమైనది. ఒకవైపు అన్ని రకాల లింగ వివక్షలను ఎండగట్టి వాటిపై పోరాడింది. ఈ క్రమంలోనే మహిళా విద్య నాణ్యతను, ఆచరణాత్మక విలువను పెంపొందించాలని విస్తతంగా ప్రచారం చేయడం ద్వారా న్యూఢిల్లీలో తదనంతరం ‘లేడీ ఇర్విన్ కళాశాల’గా రూపుదిద్దుకున్న విద్యా సంస్థకు ఆమె బీజం వేశారు. గతంలో నేషనల్ ఎకాడమీ ఆఫ్ డాన్స్, డ్రామా, మ్యూజిక్ అండ్ ఫిలిమ్స్ కు వైస్-చైర్మన్ గా సమర్థవంతంగా సేవలందించిన కమలాదేవి యునెస్కో సహకారంతో నిర్వహించే ఆసియన్ థియేటర్ సంస్థను నెలకొల్పింది. కమలాదేవి జీవితం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన కాలాన్ని ప్రతిబింబిస్తుంది. అది ఒక ఉద్వేగభరితమైన సమయం, మహాత్మా గాంధీ వలసవాదం నుండి మాత్రమే కాకుండా, మన స్వంత విభేదాల నుండి కూడా స్వేచ్ఛ కోసం పిలుపునిచ్చారు.
పురుషులతో పాటు భుజం భుజం కలిపి పోరాడాలని ఆయన మహిళలకు పిలుపునిచ్చారు. కమలాదేవి కాంగ్రెస్ మహిళా, యువజన విభాగంలో చురుకైన నిర్వాహకురాలిగా మారారు. భారతీయ మహిళ రూపురేఖలు మారడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. కమల తల్లి ఒక ఉత్సాహవంతురాలైన మహిళ, తన కుమార్తె ఎలాగైనా చదువుకోవాలని కోరుకుంది. ఒక ఉత్సాహవంతుడైన కవి అయిన హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కమలాదేవిని ప్రేమించినప్పుడు, ఆమె తన చదువును కొనసాగించాలనే షరతుపై తల్లి వివాహానికి అంగీకరించింది. కమలాదేవి బాగా పాడేది. నటన అంటే ఆమెకు చాలా ఇష్టం. అది పురుషుల ఆధిపత్యం ఉన్న రంగం కాబట్టి. హరింద్రనాథ్ను వివాహం చేసుకున్న తర్వాతే ఆమె నటనలోకి ప్రవేశించగలిగింది. తొలుత1931లో మైసూర్ లో తీసిన ‘వసంతసేన’ అనే సైలెంట్ సినిమాలో మోహన్ భవనాని దర్శకత్వంలో నటించింది. టాకీలు వచ్చిన తర్వాత ”తాన్ సేన్,శంకర్ పార్వతి, ధన్నా భగత్” వంటి చిత్రాలలో ఆమె నటించింది.
కమలాదేవికి కార్యదర్శిగా పనిచేసిన జస్లీన్ ధమిజా మాటల్లో చెప్పాలంటే-”కమలాదేవికి చాలా పదునైన నాలుక ఉండేది. హరింద్రనాథ్ చంద్రలేఖతో కలిసి ఆమెను కలవడానికి వచ్చినప్పుడు, ఆమె వ్యంగ్యంగా ఇలా వ్యాఖ్యానించింది, ”ఈ పరిమితమైన, కుతంత్రాలు పన్నే గుజరాతీ అమ్మాయిపై అతను మనసు పారేసుకోవడం ఎంత విచారకరం. ఆమె కదలికలు ఎంత మొద్దుబారిపోయినట్లు ఉన్నప్పటికీ, అతను ఆమెను గొప్ప నత్యకారిణిగా తీర్చిదిద్దగలనని అనుకుంటున్నాడు” అన్నది. ”సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలిగా, భారతీయ నాట్య సంఘం, ఆసియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ఇది తరువాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాగా మారింది) వెనుక ఉన్న మహిళగా, సమకాలీన సమాజానికి కమలాదేవి చేసిన సేవలు అనేక స్థాయిలలో ఉన్నాయి. చేతివత్తుల పునరుద్ధరణకు ఆమె చేసిన కృషి అద్భుతమైనది. ఆమె ఆధ్వర్యంలో అఖిల భారత చేతివత్తుల బోర్డు శిక్షణా, ఉత్పత్తి విభాగాలను ఏర్పాటు చేసింది; సెంట్రల్ కాటేజ్ ఇండిస్టీస్ అసోసియేషన్ అనే మార్కెటింగ్ సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది”. ”కానీ ఆమె 50 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు, పరిస్థితులు తారుమారవడం ప్రారంభించాయి.
కమలాదేవి స్థానంలో ప్రపుల్ జయకర్ ఇందిరా గాంధీకి సంస్కృతిక సలహాదారుగా మారారు. ఆ తర్వాత ఇందిర కమలాదేవిని దాదాపు అన్ని ప్రభుత్వ సంస్థల నుండి తొలగించారు. దీంతో ఆమె తన వ్యక్తిత్వంలోని మెరుపును కోల్పోవడం ప్రారంభించింది. గాంధీ, నెహ్రూల ఆదరణ పొందిన ఆమెను ఇందిరా గాంధీ దూరం పెట్టింది. అందుకు నెహ్రూ కాలంలో సరోజినీ కుటుంబం అతి దగ్గరగా ఉన్న సందర్భాలలో ఎదురైన చేదు అనుభవాలు ఇందుకు కారణమై ఉండవచ్చు. ఆమె సాంగత్యాన్ని ఇష్టపడే ఆకర్షణీయమైన పురుషులు ఆ రోజుల్లో ఎక్కువే. ఒకసారి ఇరాన్లో, ఆకస్మిక అనారోగ్యం కారణంగా ఆమె మంచానికే పరిమితమైంది. ఒక పర్షియన్ వాస్తుశిల్పి సందర్శనతో ఆమె అద్భుతంగా కోలుకుంది. అతను ఆమెకు ఒక గ్లాసు పర్షియన్ వైన్ ఇచ్చినప్పుడు, మద్యం అంటే ఇష్టం లేని ఆమె, ”ఆహా, మీరు నాకు హాఫిజ్ , సాదీ కవిత్వాలు చదువుతుంటే, నేను పర్షియన్ వైన్ రుచి చూడాలి కదా!” అని చెబుతూ సేవించింది.” రచయిత్రిగా కమలాదేవి ట్రైబలిజం అండ్ ట్రైబల్స్ ఇన్ ఇండియా, అవేకింగ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ హుడ్ ఆన్ వార్ టోర్న్ చైనా, మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ క్రాప్ట్స్, టు వర్డ్స్ నేషనల్ థియేటర్ గ్రంథాలు రాసింది.
‘ఇన్నర్ స్పేసెస్ అవుటర్ స్పేసెస్’ అన్న పుస్తకం కమల ఆశయాలు వ్యక్తిత్వం భారతీయ చరిత్రల మిశ్రమంగా సాగిన రచనగా విమర్శకులు ప్రశంసించారు. ”మన కాలంలో జీవన నాణ్యతకు అత్యంత ఎక్కువ కృషి చేసిన వ్యక్తిని ఎంపిక చేయడానికి ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీకి ఆమె బద్ధ శత్రువు అధ్యక్షత వహిస్తున్నప్పటికీ, ఆమె కమలాదేవి చటోపాధ్యాయను ‘చార్లెస్ ఈమ్స్’ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.” అని 1980వ దశకం మధ్యలో రోమేష్ థాపర్ చెప్పిన మాటలు కమలాదేవి వ్యక్తిత్వాన్ని, కార్య దక్షతను పట్టి చూపుతాయి. కమలాదేవి అందుకున్న సత్కారాలు బిరుదులు చాలా ఉన్నవి.
వాటిలో పద్మభూషణ్ (1955), పద్మ విభూషణ్ (1987), రామన్ మెగసేసే అవార్డు (1966), 1974లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, సాంప్రదాయ, హస్తకళలకు చేసిన సేవలకు గాను యునెస్కో ప్రశంస, వాట్మల్ ఫౌండేషన్ అవార్డు, జెకోస్లేవేకియా అధ్యక్షుడు ద్వారా స్వర్ణ పథకం, విశ్వభారతి విశ్వవిద్యాలయం దేశికోత్తమ అవార్డు (1970) వంటివి వాటిలో కొన్ని. బాల్యం తప్ప విద్యార్థినిగా, సామాజిక ఉద్యమకారిణిగా, రచయిత్రిగా, వ్యక్తిగత, సామాజిక జీవితంలో ఏడు దశాబ్దాలపాటు అలుపెరుగని మహిళా శక్తిగా తన కార్య రంగాన్ని నిరంతరం సాగించిందామె. కమలాదేవి తన చివరి రోజులలో బొంబాయిలో జరిగే శిల్ప ఉత్సవంలో పాల్గొనడానికి ఢిల్లీ నుండి వెళ్ళింది. అక్కడే ఆమెకు గుండెపోటు రావడంతో బ్రిచికాండి ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆమె తిరిగి కోలుకోకుండానే కన్ను మూసింది. ఆరోజు 1988 అక్టోబర్ 29. భారతీయ హస్త కళలు, సాంస్కతిక కళారంగానికి ఎనలేని సేవలు అందించిన కమలాదేవి చటోపాధ్యాయ జీవితం దేశ మహిళా వికాస చరిత్రలో చెరిగిపోనిది.
- హెచ్ రమేష్ బాబు,
గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386



