– కమ్మర్ పల్లిలో సభకు ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఈ నెల 15న 42శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన కామారెడ్డి బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని మండల బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అందరూ తరలి వచ్చి కామారెడ్డి బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్ పి మండల అధ్యక్షులు నల్ల కైలాస్ మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దేశ జనాభాలో మెజార్టీ స్థానంలో ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నారు.
అగ్రవర్ణాల అణిచివేత వల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో జనాభా నిష్పత్తికి సరిపడా ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీ జనాభా 60శాతం కు పైగా ఉన్నప్పటికీ 29శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయడం అన్యాయం అన్నారు. మా వాటా మాకు కావాలి… మా అధికారం మాకు కావాలి నినాదంతో బీసీ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన మేరకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడంలో చేస్తున్న జాప్యం సరైంది కాదన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 15వ తేదీన కామారెడ్డి, సత్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు పెద్దఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్, గుండోజి నవీన్, తదితరులు పాల్గొన్నారు.



