– దుబ్బాకలో శిశువు అపహరణకు సంబంధించిన కేసులో.. అసలు విషయం వెలుగులోకి
నవతెలంగాణ-దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అపహరణకు గురైన బాలుని మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త ప్రవర్తనతో విసుగుచెంది.. అతన్నుంచి విడిపోవాలని ఆ బాలుడిని కన్నతల్లే చంపిందని పోలీసుల విచారణలో తేలింది. దుబ్బాకలోని సీఐ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పి.శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈనెల 21న దుబ్బాక మండలం అప్పనపల్లిలో గుర్తు తెలియని దుండగులు రెండు నెలల బాలుడిని అపహరించారని.. ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఎస్‌ఐ వి.గంగరాజు తమ సిబ్బందితో కలిసి పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. గ్రామంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అనుమానంతో ఆ బాలుని తల్లి కవితను విచారించగా.. తానే బాలుడిని బావిలో పడేసినట్టు నేరం ఒప్పుకుందన్నారు. మూడేండ్ల క్రితం రామగాళ్ల శ్రీమాన్‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్న కవిత.. ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు దూరమైంది. భర్త శ్రీమాన్ పలు కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. అలాగే అతను తరుచూ కవితను మానసికంగా వేధించేవాడు. దాంతో అతని ప్రవర్తన పట్ల విసుగు చెందిన కవిత.. తన రెండు నెలల కుమారుడ్ని గ్రామ సమీపంలోని రాజిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో పడేసింది. ఏమీ తెలియనట్టు గుర్తు తెలియని దుండగులు అపహరించారంటూ భర్తకు చెప్పి పోలీస్ కేసు పెట్టించింది. కాగా, పోలీసుల దర్యాప్తులో ఆమె నేరం అంగీకరించడంతో.. నిందితురాల్ని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్‌ఐ గంగరాజు, సిబ్బందిని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సీఐ శ్రీనివాస్ అభినందించారు.
భర్త ప్రవర్తనతో విసుగు చెంది.. బాలుడిని హతమార్చిన కన్నతల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES