ముంబయి, ఉత్తరప్రదేశ్ ఓటమి
విజయ్ హజారే ట్రోఫీ
బెంగళూరు : ప్రతిష్టాత్మ దేశవాళీ వైట్‌బాల్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక, సౌరాష్ట్ర సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. సోమవారం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) గ్రౌండ్‌లో జరిగిన తొలి క్వార్టర్‌ఫైనల్లో ముంబయిపై కర్నాటక 55 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసింది. ముంబయి తరఫున శామ్స్ ములాని (86), సాయిరాజ్ పాటిల్ (33 నాటౌట్) రాణించారు. దేవదత్ పడిక్కల్ (81 నాటౌట్), కరుణ్ నాయర్ (74 నాటౌట్) రాణించటంతో 33 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. . వర్షం అంతరాయంతో కర్ణాటక లక్ష్యాన్ని విజెడి పద్దతిలో 33 ఓవర్లలో 133 పరుగులుగా నిర్దేశించారు.
వర్షం అంతరాయం కలిగించే సమయానికి కర్ణాటక నిర్దేశిత లక్ష్యానికి 55 పరుగుల ముందంజలో నిలువటంతో.. ముంబయికి పరాజయం తప్పలేదు. రెండో క్వార్టర్‌ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై సౌరాష్ట్ర 17 పరుగులతో గెలుపొందింది. తొలుత ఉత్తరప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో అభిషేక్ గోస్వామి (88), సమీర్ రిజ్వీ (88 నాటౌట్) రాణించారు. ఛేదనలో హార్విక్ దేశాయ్ (100 నాటౌట్), ప్రేరకన మన్కడ్ (67), చిరాగ్ జాని (40 నాటౌట్) రాణించటంతో సౌరాష్ట్ర 40.1 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. వర్షం అంతరాయంతో సౌరాష్ట్ర లక్ష్యాన్ని విజెడి పద్దతిలో 40.1 ఓవర్లలో 222 పరుగులుగా తేల్చారు. దీంతో సౌరాష్ట్ర 17 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. నేడు జరిగే మరో రెండు క్వార్టర్‌ఫైనల్స్‌లో పంజాబ్‌తో మధ్యప్రదేశ్.. ఢిల్లీతో విదర్భ తలపడుతాయి.



