Wednesday, July 16, 2025
E-PAPER
Homeజాతీయంరైతుల డిమాండ్లకు తలొగ్గిన కర్నాటక సర్కార్‌

రైతుల డిమాండ్లకు తలొగ్గిన కర్నాటక సర్కార్‌

- Advertisement -

– మూడేండ్లకు పైగా సాగిన రైతుల ఉద్యమంతో రద్దైన భూ సేకరణ ప్రక్రియ
– పారిశ్రామికాభివృద్ధి పేరుతో సాగు భూమిని తీసుకోవడంపై మండిపడ్డ రైతన్న
– అన్నదాతలకు ఏఐకేఎస్‌ అభినందనలు
బెంగళూరు :
మూడేండ్లకు పైగా అకుంఠిత దీక్షతో, కృత నిశ్చయంతో రైతులు సాగించిన మహోద్యమంతో కర్నాటక ప్రభుత్వం తోక ముడవక తప్పలేదు. ఎన్ని బెదిరింపులు, అణచివేత చర్యలు చేపట్టినా వాటికి వెరవకుండా రైతులు కొనసాగించిన తీవ్ర వ్యతిరేకత, నిరసనల కారణంగా ఏరోస్పేస్‌ పార్క్‌ కోసం చేపట్టదలచిన వేలాది ఎకరాల భూ సేకరణ ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దేవనహళ్ళి తాలుకాలోని 13 గ్రామాల్లో 1777 ఎకరాల భూమిని పార్కు నిర్మాణం కోసం సేకరించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తలపెట్టింది. అయితే రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించారు. తక్షణమే భూ సేకరణను నిలిపివేయాంటూ రైతులు ప్రారంభించిన నిరనలు మంగళవారానికి 1198వ రోజుకు చేరాయి. ఈ పరిస్థితుల్లో రైతుల డిమాండ్‌కు తలొగ్గుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య ప్రకటించారు. బెంగళూరులో రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే ఈ ప్రాజెక్టు కోసం ఎవరైతే స్వచ్చందంగా తమ భూమిని ఇవ్వాలనకుంటున్నారో అటువంటి రైతుల నుంచి భూమిని ప్రభుత్వం సేకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అధిక ధరలకు ఆ భూమిని కొనుగోలు చేయడమే కాకుండా, ఆ రైతులకు అభివృద్ధిపరిచిన భూమిలో కొంత భాగాన్ని ఇవ్వడం వంటి చర్యలు కూడా చేపడతామని ప్రకటించారు. ఈ ప్రతిపాదిత పార్కులో కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ఇక్కడ అవకాశం లేకపోతే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం వుందని అన్నారు. అయినప్పటికీ, తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని గట్టిగా పట్టుబడుతున్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఇక ఈ భూ సేకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
తమ డిమాండ్‌ సాధన కోసం దేవనహళ్ళి తాలుకా రైతులు చన్నరాయపట్నాలో గత 1198 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. తమ భూములన్నీ మంచి సాగుభూములని, పక్కనే బెంగళూరులోనే గల మార్కెట్లలో తమ పంటలకు మంచి గిట్టుబాటు ధర వస్తోందని, అటువంటి భూములను పార్కు కోసం ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో సాగు భూముల స్వాధీనం చేసుకోవడంలో ఆంతర్యాన్ని వారు ప్రశ్నించారు.
రైతులు చేపట్టిన ఈ ఆందోళనలకు విస్తృతంగా మద్దతు లభించింది. వివిధ ప్రగతిశీల సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. తమ డిమాండ్లు పెడచెవిన పెడితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీంతో ఇక ప్రభుత్వం మెట్టు దిగి రాక తప్పలేదు. జులై మొదటి వారంలో రైతు ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఇందులోని చట్టపరమైన సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు కొంత సమయం కావాలని కోరారు. చిట్టచివరిగా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.
పోరాటం రూపుదిద్దుకుందిలా…
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో బహుళ పంటలు పండే భూమిపై కార్పొరేట్‌ సంస్థలు కన్నేశాయి. అందుకు అనుగుణంగా గతంలోని బిజెపి ప్రభుత్వం ఆ భూములను కార్పొరేట్‌ సంస్థలు స్వాధీనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. దీని వెనుక రియల్‌ ఎస్టేట్‌ మాఫియా, బిల్డర్లు వున్నారు. కానీ 13 గ్రామాల్లోరైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. సమైక్యంగా పోరు బాట పట్టారు. అయితే విభజించి పాలించు అన్న చందాన అందులో మూడు గ్రామాలను సేకరణ ప్రక్రియ నుండి పక్కకు పెట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయినా రైతుల ఐక్యత చెక్కు చెదరలేదు. గత నెల 26న శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జి చేశారు. అనేకమందిని అరెస్టు చేశారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. రచయితలు, కళాకారులు, పౌరసమాజ గ్రూపులు ఇలా అందరూ కలిసి రైతులకు సంఘీభావం ప్రకటించారు.
ఇక గత్యంతరం లేక ముఖ్యమంత్రి, రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతులు పెద్ద ఎత్తున సాగించిన నిరసనల్లో ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌తో సహా సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పలువురు కూడా పాల్గొన్నారు. కేపీఆర్‌ఎస్‌ నాయకత్వంతో పాటు సీఐటీయూ, ఎఐఏడబ్ల్యూయూ, ఐద్వా సహా పలు సంఘాల నేతలు కీలక పాత్ర పోషించారు.
ఏఐకేఎస్‌ అభినందనలు
సమైక్యంగా పోరాటం సాగించి ప్రభుత్వం వెనుకడుగు వేసేలా, నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేసినందుకు కర్నాటక రైతులు, వ్యవసాయ కార్మికులను అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అభినందించింది. ఈ మేరకు ఏఐకేఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌ ధావలె, విజ్జూ కృష్ణన్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడే రైతాంగ ఉద్యమానికి ఈ విజయం చాలా కీలకమైనదని వారు వ్యాఖ్యానించారు. భూములను తీసుకుని తమకివ్వాల్సిన నష్టపరిహారం సరిపోలేదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలనే డిమాండ్లతో వీరు ఈ పోరాటం సాగించలేదని, వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం బలవంతంగా ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రశ్నించారని, అందుకు వ్యతిరేకంగానే ఈ పోరాటం చేపట్టి విజయం సాధించారని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా వేలాది ప్రాంతాల్లో ఇటువంటి తరహాలో సాగే పోరాటాలకు, ఉద్యమాలకు ఇది స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. ఈ చారిత్రక పోరాటం గురించి, మహత్తర విజయాన్ని సాధించిన తీరు గురించి సమాచారంఅందరికీ తెలిసేలా ప్రచారం చేయాల్సిందిగా ఎఐకెఎస్‌ తన శాఖలకు పిలుపునిచ్చింది. భవిష్యత్తులో సాగించే ఇటువంటి పోరాటాల్లో సంయుక్త హోరాటా కర్ణాటక, సంయుక్త కిసాన్‌ మోర్చాలకు మద్దతుగా ఎఐకెఎస్‌ నిలబడుతుందని వారు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -