నవతెలంగాణ – బెంగళూరు : సాంకేతిక పురోగతి వల్ల ఉద్యోగాలు కోల్పోకుండా చూసుకోవడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) యుగం యొక్క సవాళ్లకు కన్నడను సిద్ధం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆ రాష్ట్ర సిఎం సిద్ధరామయ్య అన్నారు. నేడు కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం. 1956, నవంబర్ 1న ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికి ఈ రాష్ట్రం ఏర్పడి 69 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శనివారం పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం నిర్వహించిన 70వ కర్ణాటక రజతోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో కన్నడ పాత్రను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది అని అన్నారు. సమాచార సాంకేతిక యుగం ఇప్పుడు ఎఐ యుగంలోకి మారుతుంది. ఎఐ విప్లవంలో మా ప్రజలు వెనుకబడిపోకుండా ఉండటానికి మేము కన్నడను కొత్త సాంకేతిక సవాళ్లకు సిద్ధం చేయడానికి కట్టుబడి ఉన్నాము. దీనివల్ల మన దేశంలో ఉపాధి అవకాశాలు కోల్పోకుండా ఉంటాయి. కన్నడ భాషను ఆధునిక సాంకేతిక భాషగా మార్చడానికి పండితులు, సాంకేతిక నిపుణులు ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు.
ఇంగ్లీషు, హిందీ భాషల వల్ల చిన్నారులు మాతృభాషకు దూరమవుతున్నారు. దీంతో వారి సృజనాత్మకత క్రమంగా బలహీనపడుతోందని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో చిన్నారులు వారి సొంత భాషల్లోనే ఆలోచిస్తారు, నేర్చుకుంటారు, కలలు కంటారు. అదే మన దేశంలో ఇక్కడ మన పిల్లల్ని ఇంగ్లీషు, హిందీ భాషలవైపు బలవంతంగా నెట్టేయడం జరుగుతుంది. దీంతో వారి ఊహాశక్తి, మేధో వికాసంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ తరుణంలో చిన్నారులు విద్యను మాతృభాషలోనే కొనసాగించడానికి కేంద్రం తగిన చట్టాలను రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది అని సిద్ధరామయ్య అన్నారు.
కన్నడ భాష దాని వారసత్వం, సంస్కృతిని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఓ కొత్త విధానాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కన్నడ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. 800 కన్నడ మీడియం, 100 ఉర్దూ మీడియం పాఠశాలలను రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో అత్యున్నత మౌలిక సదుపాయాలతో కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ (కెపిఎస్)గా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా 180 మదర్సాల్లో కన్నడ బోధించనున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే సంవత్సరాల్లో 1,500 మదర్సాల్లో కన్నడలోనే బోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. అలాగే కెపిఎస్ మోడల్ కింద 100 ఉర్దూ పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 483 కోట్ల మంజూరు చేసింది. అన్ని వర్గాల పిల్లలు కన్నడ నేర్చుకోవాలని ఆయన కోరారు.
విద్యలో కన్నడ భాషను నిర్లక్ష్యం చేయడం వల్ల సామాజిక, మేధోపరమైన అంతరాలు ఏర్పడ్డాయని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. ఒక దేశాన్ని నిర్మించడం అంటే కేవలం రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు. మన పిల్లల్లో భావోద్వేగ, సాంస్కృతిక, భాషా సామరస్యాన్ని పెంపొందించం కూడా. ఈరోజు ఏర్పడిన రాష్ట్రం. రాష్ట్ర అవతరణకు సమైక్య ఉద్యమంలో పాల్గొన నేతలకు ఆయన ఈ సందర్భంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ఉద్యమాలను ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోన్న కేంద్రం
రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు. కర్ణాటక 4.5 లక్షల రూపాయల పైగా పన్నులను చెల్లిస్తుంది. అయినా సరే నిధులు, గ్రాంట్లలో కేంద్రం న్యాయంగా ఇవ్వడం లేదు. హిందీ, సంస్కృత రాష్ట్రాలకే ఎక్కువ మద్దతు ఇస్తుంది. ఆ రాష్ట్రాలకే నిధులను విడుదల చేస్తోంది. కానీ కన్నడ, ఇతర ప్రాంతీయ భాషా రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత వైఖరి చూపిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డిఐ) మహారాష్ట్ర కర్ణాటను అధిగమించింది. ఆ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి 50,107 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో దేశం మొత్తం ఎఫ్‌ఐడిఐల్లో ఒక్క మహారాష్ట్రనే 51 శాతం వాటా కలిగి ఉంది. దీంతో గత దశాబ్దంలో ఆ రాష్ట్ర తలసరి ఆదాయం 101 శాతం పెరిగింది. నిరుద్యోగిత రేటు 2.5 శాతం వద్ద ఉంది.
కర్ణాటక ప్రగతిశీల వారసత్వాన్ని యువత ముందకు తీసుకెళ్లాలని సిఎం కోరారు. మన యువత హేతుబద్ధమైన, శాస్త్రీయమైన, మానవీయ సమాజాన్ని నిర్మించడంలో ముందుండాలి. మన సొంత వృద్ధి నమూనాలను అభివృద్ధి చేసుకుంటూనే ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల నుండి మనం ప్రేరణ పొందాలి అని సిద్ధరామయ్య యువతకు సూచించారు.
ఎఐ సవాళ్లను ఎదుర్కోవడానికి కన్నడను సిద్ధం చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం : సిద్ధరామయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


