Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరోజుకు పది పనిగంటలు.. ప్రతిపాదించనున్న కర్నాటక

రోజుకు పది పనిగంటలు.. ప్రతిపాదించనున్న కర్నాటక

- Advertisement -

– కార్మిక సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం
బెంగళూరు:
రోజుకు 10 పని గంటలను కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈ మేరకు కర్నాటక షాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1961కు సవరణలు చేయనుంది. ప్రస్తుతం రోజుకు ఉన్న తొమ్మిది పని గంటలను పది పని గంటలకు, అలాగే మరిన్ని ఓవర్‌ టైం పని గంటలను పెంచుతూ పై చట్టానికి సవరణలు చేయనుంది. ఈ చట్టం కర్ణాటకలోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని గంటలను, కార్మిక పరిస్థితులను నియంత్రించే చట్టం. అలాగే ఈ చట్టం ఉద్యోగులు ఎంతకాలం పనిచేయవచ్చు, ఓవర్‌ టైం విధులు, రికార్డులు, నిబంధనలు పాటించడం వంటి అంశాలను కూడా నిర్ధేశిస్తుంది.
ఈ చట్టంలో ప్రతిపాదించిన సవరణలు సంస్థలకు ప్రధానంగా చిన్న సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. సంస్థల వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని, ఇప్పటికే ఆచరణలో ఉన్న పని గంటల విధానాలను చట్టబద్ధం చేస్తుందని ఈ సవరణలకు మద్దతు ఇస్తున్నవారు చెబుతున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం పని గంటలను రోజుకు 10 గంటలను, వారానికి 48 గంటలకు సంస్థలు పెంచుకోవచ్చు. అయితే ఓవర్‌ టైంతో సహా మొత్తం పని గంటలు రోజుకు 12 గంటలకు మించకూడదు. ఒక ఉద్యోగి మూడు నెలల పాటు వరుసగా 144 గంటలు ఓవర్‌ టైం పని చేయవచ్చు. ప్రస్తుతం ఇది 50 గంటలుగా ఉంది. అయితే 10 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంది.
ఈ ప్రతిపాదిత సవరణలతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ (ఐటి, ఐటిఇఎస్‌) రంగాల్లోని కంపెనీలు భారీగా లబ్ధిపొందుతాయని భావిస్తున్నారు. కర్ణాటకలో ఈ సంస్థలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రతిపాదనలపై కార్మికుల సంఘాలు, కార్మికులు తీవ్ర అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఈ చట్టం ఉల్లంఘనలను ఈ ప్రతిపాదనలు చట్టబద్ధం చేస్తాయని, కార్మికుల దోపిడీకి దారితీస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పని గంటలకు అనుగుణంగా వేతనాన్ని పెంచడంపై చట్టం అస్పష్టంగా ఉందని కూడా విమర్శిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక చట్టాలను తొలగిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గుతుందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ మద్దతుగల ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ (ఐఎన్‌టీయూసీ) కూడా ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తుంది. కాగా, పనిగంటలను పెంచడానికి అనుమతించే నాలుగు కార్మిక కోడ్‌లను మోడీ ప్రభుత్వం ఆమోదించిన తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఇటువంటి కొత్త చట్టాలను ఆమోదించారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కూడా ఇటీవలే పనిగంటలను రోజుకు 10కు పెంచడానికి ఆమోదించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad