Friday, May 23, 2025
Homeమానవికునుకు కరువైందా..?

కునుకు కరువైందా..?

- Advertisement -

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సుఖవంతమైన నిద్ర కష్టంగా మారిపోయింది. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. హాయిగా నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని.. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కొందరిలో ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్రరాక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ టిప్స్‌ పాటించడం వల్ల హాయిగా నిద్రపోతారని వెల్లడిస్తున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకే సమయానికి నిద్రపోవాలి: ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం శరీరానికి అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. సెలవు రోజుల్లోనూ క్రమం తప్పకుండా దీనిని పాటించడం వల్ల జీవగడియారం సరైన పద్ధతిలో నడుస్తుందని తెలిపారు. ఫలితంగా సులభంగా నిద్రపోతారని వెల్లడిస్తున్నారు.
పుస్తకాలు, ధ్యానం చేయండి: రోజూ పడుకునే ముందు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలని చెబుతున్నారు. లేదా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి కావాలనే సంకేతాన్ని మెదడుకు అందించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుందని వివరిస్తున్నారు.
ప్రశాంతంగా ఉండాలి: మనం పడుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెలుతురు, శబ్దాలు లేకుండా ముఖ్యంగా చక్కటి పరుపు, దిండు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలి: రాత్రి సమయంలో ఫోన్‌, కంప్యూటర్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి బ్లూ లైట్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రకు ఉపకరించే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా సరిగ్గా నిద్ర పట్టదని అంటున్నారు. అందుకే నిద్రపోవడానికి కనీసం 60-90 నిమిషాల ముందు వరకు స్క్రీన్‌కు దూరంగా ఉండాలి.
కాఫీ తాగవద్దు: సుఖవంతమైన నిద్రకు మీరు తీసుకునే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం కాఫీ, టీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే స్పైసీ ఫుడ్‌, అధిక ఆహారం తీసుకోవడం కూడా నిద్రకు భంగం కలిగిస్తాయని చెబుతున్నారు.
వ్యాయామం చేయాలి: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హాయిగా నిద్ర పోతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 30-45 నిమిషాల పాటు వాకింగ్‌, జాగింగ్‌, యోగా చేయడం వల్ల నిద్రపడుతుందని అంటున్నారు. అయితే పడుకోవడానికి 2-3 గంటల ముందు కఠిన వ్యాయామాలు చేస్తే నిద్రకు భంగం కలుగుతుంది.
ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి: నిద్రభంగానికి ఒత్తిడి, ఆందోళన ముఖ్య కారణాలని నిపుణులు అంటున్నారు. అందుకే వీటిని తగ్గించుకోవడం వల్ల హాయిగా పడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇందుకోసం యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలని సలహా ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -