నవతెలంగాణ-హైదరాబాద్: తమిళ స్టార్ యాక్టర్, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన కరూర్ ర్యాలీ విషాదంగా మారిన సంగతి తెలిసిందే. తొక్కసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఘటనపై ప్రాథమిక వివరాలు కోరడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
ప్రచారంలో పాల్గొన్న వారి వివరాల గురించి అధికారులు అడిగారని, సీసీటీవీ ఫుటేజ్ కోరారని టీవీకే నేత నిర్మల్ కుమార్ అన్నారు. తాము ఇప్పటికే సిట్‌కు ఈ వివరాలు అందించినట్లు చెప్పారు. అవసరమైన సమాచారాన్ని అందించడానికి మాత్రమే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. సీబీఐ ఫస్ట్ లెవల్ దర్యాప్తు కోసం వివరాలు అడిగారని, వాటిని మూడు నాలుగు రోజుల్లో అందిస్తామని చెప్పారు.



