నవతెలంగాణ-హైదరాబాద్: రాజకీయపార్టీలు, ఇతర సంస్థలు నిర్వహించే బహిరంగ కార్యక్రమాలకు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జస్టిస్ అరుణ జగదీశన్ విచారణ కమిషన్ తన నివేదికను సమర్పించిన అనంతరం ఫ్రేమ్‌వర్క్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. నిబంధనలు, మార్గదర్శకాలపై అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు.
రాజకీయ పార్టీల, ఇతర సంస్థలు నిర్వహించే బహిరంగ కార్యక్రమాలకు నిబంధనలు రూపొందించడం తమ సమిష్టి కర్తవ్యమని, విచారణ కమిషన్ నుండి నివేదిక వచ్చిన తర్వాత వాటిని రూపొందిస్తామని ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్‌లో పేర్కొన్నారు. కమిషన్ సమర్పించే నివేదికపై ప్రభుత్వ చర్య ఆధారపడి ఉంటుందని హామీ ఇస్తున్నానని స్టాలిన్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
కరూర్ ఘటనపై సోషల్‌మీడియాలో వస్తున్న అసత్యపు సమాచారంపై కూడా స్టాలిన్ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని, బాధ్యతారాహిత్యమైన లేదా దురుద్దేశపూరితమైన వ్యాఖ్యలు ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్న పుకార్లు మరియు తప్పుడు వార్తలను గుర్తించానని, ఏ రాజకీయ నేత తమ పార్టీ కార్యకర్తలు లేదా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాలని కోరుకోరని అన్నారు. మృతులు ఏపార్టీకి చెందిన వారైనా తనకు సంబంధించినంత వరకు వారు తమిళులేనని స్పష్టం చేశారు. వారి బాధ్యతారాహిత్యమైన మరియు దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని అన్నారు.
రాజకీయ హోదాలు, భిన్నమైన సిద్ధాంతాలు మరియు వ్యక్తిగత శతృత్వాలను పక్కనపెట్టాలని, ప్రజల సంక్షేమం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో తమిళనాడు అగ్రగామిగా ఉందని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడం అందరి సమిష్టి బాధ్యత అని అన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన ఒక పెద్ద విషాదమని, దురదృష్టకరమైన ఘటన అని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.