Thursday, May 15, 2025
Homeజాతీయంభయం గుప్పెట్లో కాశ్మీరం

భయం గుప్పెట్లో కాశ్మీరం

- Advertisement -

– సహాయ శిబిరాలలో బిక్కుబిక్కుమంటూ కాలక్షేపం
– స్వస్థలాలకు వెళ్లేందుకు వెనుకంజ
– పాక్‌ మళ్లీ కాల్పులకు తెగబడుతుందేమోనన్న భయాందోళన
శ్రీనగర్‌:
భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ సమీపంలో నివసిస్తున్న ప్రజానీకంలో ఇంకా భయం వీడలేదు. నాలుగు రోజుల పాటు కొనసాగిన డ్రోన్లు, క్షిపణి దాడులలో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యపై అధికారిక సమాచారమేదీ వెలువడలేదు. పాక్‌ దాడులలో ఐదుగురు భారత సైనికులు వీర మరణం పొందారు. పాకిస్తాన్‌ దాడుల కారణంగా బాగా దెబ్బతిన్న ప్రాంతం పూంచ్‌. అక్కడే నలుగురు పిల్లలు సహా 14 మంది చనిపోయారు. పూంచ్‌లో మరణించిన వారిలో 13 సంవత్సరాల కవలలు జైన్‌ అలీ, అతని సోదరి ఉర్వా ఫాతిమా కూడా ఉండడం అందరినీ కలచివేస్తోంది. పాక్‌ కాల్పులలో ఓ సిక్కు కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు సైతం ప్రాణాలు కోల్పోయారు. రాజౌరిలో జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్‌ సహా ముగ్గురు చనిపోయారు. పాక్‌ కాల్పులకు రెండు సంవత్సరాల బాలిక కూడా బలైపోయింది. ఉత్తర కాశ్మీర్‌లోని యురి పట్టణంలోనూ, జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్‌ఎస్‌ పురాలోనూ ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన మూడు రోజుల తర్వాత జమ్మూకాశ్మీర్‌ అధికారులు ప్రాణనష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగమయ్యారు. సరిహద్దు ప్రాంతాలలో పాక్‌ అమర్చిన పేలుడు పదార్థాలు ఇంకా అలాగే ఉన్నాయేమోనన్న ఆందోళన స్థానికుల ను నిద్ర పోనివ్వడం లేదు.దెబ్బతిన్న ఇండ్లను తిరిగి పునర్నిర్మించుకునేందుకు సైతం సరిహద్దు ప్రాంతాల ప్రజలు వెనకాడుతున్నా రు. యురి, పూంచ్‌ జిల్లాలకు చెందిన అనేక మంది ప్రజలు ఇప్పటికీ పాఠశాలలు, మసీదులు, ఇతర ప్రదేశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలలో తలదాచుకుంటున్నారు. భూగర్భ బంకర్ల కొరత కారణంగా ప్రాణనష్టం కొంత ఎక్కువగా జరిగిందని పలువురు ఫిర్యాదు చేశారు. చాలా మంది బాధితులు స్వస్థలాలకు చేరుకుంటు న్నప్పటికీ పాక్‌ మళ్లీ దుశ్చర్యలకు తెగబడుతుం దేమోనన్న భయం వారిని పట్టి పీడిస్తోంది. రెండు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన చర్చలు విఫలమవుతాయేమోనని వారు అనుమానిస్తున్నారు. ‘మనం ఏం సాధించాము? అనేక ప్రాణాలు పోయాయి. చాలా ఇళ్లు శిథిలాలుగా మారిపోయాయి. పూంచ్‌లో జరిగిన విధ్వంసం, మరణాలే మనం పాకిస్తాన్‌కు ఇచ్చిన సమాధానమా? మా ఇంటిపై పాక్‌ దళాలు మరోసారి దాడి చేయవ ని ఎవరు గ్యారంటీ ఇస్తారు?’ అని అజీజ్‌ అనే బాధితుడు వాపోయాడు. 1947-48లో జరిగిన భారత్‌, పాక్‌ యుద్ధం తర్వాత తొలిసారిగా ఇప్పుడు పూంచ్‌ నగరంలోని జనావాసాలపై శతఘ్ని దాడులు జరిగాయని 90 సంవత్సరాల సయీద్‌ హుస్సేన్‌ తెలిపారు. ‘1965, 1971, 1999 యుద్ధాల సమయం లో కూడా మాకేమీ నష్టం జరగలేదు. కానీ ఏడవ తేదీ నుండి సైనిక కార్యకలాపాలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇప్పటి వరకూ మూడు యుద్ధాలు జరిగాయి. అయినా ఉగ్రవాదం అలాగే ఉంది. ప్రాణ, ఆస్తి నష్టం మినహా మనం సాధించిందేమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. యురిలోని ప్రధాన మార్కెట్‌లో ఇంకా వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోలేదు. ప్రజలు భయంతో ఇండ్లు దాటి బయటకు రావటలేదు..భారత్‌, పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న శత్రుత్వం కారణంగా జమ్మూకా శ్మీర్‌ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారని అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత, యురి శాసనసభ్యుడు సజ్జాద్‌ షాఫీ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కాల్పుల విరమణ అవసరం లేదని, శాశ్వత పరిష్కారం కావాలని ఆయన అభిప్రాయపడ్డా రు. ‘ఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఉండే ప్రతి ఒక్కరూ బాగానే ఉన్నారు. సరిహద్దు ప్రజలమైన మేమే గూడు కోల్పోయి వీధిన పడ్డాము. మా పూర్వీకులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మేము, మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నాం. సాధ్యమైనం త త్వరగా ఘర్షణకు శాశ్వత పరిష్కారం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌ కాల్పులు జరిపే సరిహద్దు ప్రాంతాలలో ప్రభుత్వం భూగర్భ బంకర్లు నిర్మించాలని యురికి చెందిన మునీర్‌ హుస్సేన్‌ కోరారు. అదృష్టం బాగుండి బతికి బయటపడుతున్నామని, మళ్లీ కాల్పులు మొదలైతే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -