Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరక్త సంబంధంపై 'కాసుల' కత్తి..

రక్త సంబంధంపై ‘కాసుల’ కత్తి..

- Advertisement -

ఇన్సూరెన్స్‌ డబ్బులు రూ.4.14 కోట్ల కోసం అన్నను చంపిన తమ్ముడు
టిప్పర్‌తో ఢకొీట్టి ప్రమాదంగా చిత్రీకరణ
అల్లుడి సాక్ష్యంతో బట్టబయలైన కుట్ర
షేర్‌ మార్కెట్‌ నష్టాలు.. రూ.1.50 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఘాతుకం
ముగ్గురు నిందితుల రిమాండ్‌

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
డబ్బు.. మనిషిని మృగంగా మారుస్తుంది అనడానికి కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పేగుబంధం కన్నా కాసులే ముఖ్యమని భావించిన ఓ తమ్ముడు.. మానసిక స్థితి సరిగ్గా లేని సొంత అన్నపై ఇన్సూరెన్స్‌ చేయించి.. ఆ డబ్బుల కోసం పక్కా స్కెచ్‌ వేసి.. అతన్ని టిప్పర్‌ టైర్ల కింద నలిపేశాడు. ఆ తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి నరేష్‌ షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. దాంతోపాటు జల్సాలకు అలవాటు పడ్డాడు. టిప్పర్ల ఈఎంఐలు, ఇతరత్రా కలిపి రూ.1.50 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడంతో మానసిక పరిపక్వత లేని తన అన్న మామిడి వెంకటేష్‌(37)ను చంపేస్తే, ఇన్సూరెన్స్‌ రూపంలో రూ.కోట్లు వస్తాయని నరేష్‌ ప్లాన్‌ వేశాడు.

రూ.4 కోట్ల ‘డెత్‌’ ప్లాన్‌..
హత్యకు ముందే అన్న వెంకటేష్‌ పేరు మీద ఐసీఐసీఐ, టాటా ఏఐజీ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి రూ.4 కోట్లా 14 లక్షల ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకున్నాడు. అన్న చనిపోతే ఇన్సూరెన్స్‌ డబ్బులతోపాటు, అతని పేరుపై ఉన్న రూ.20 లక్షల గోల్డ్‌ లోన్‌ కూడా మాఫీ అవుతుందని లెక్కలు వేసుకున్నాడు. ఈ పనిలో తన స్నేహితుడు నముండ్ల రాకేశ్‌, టిప్పర్‌ డ్రైవర్‌ మునిగాల ప్రదీప్‌ను భాగస్వాములను చేశాడు.

ఆ రాత్రి జరిగింది ఇదే..
నవంబర్‌ 29, 2025.. సమయం రాత్రి 10గంటలు. రామడుగు శివారులోని భారత్‌ పెట్రోల్‌ పంప్‌ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ప్లాన్‌ ప్రకారం డ్రైవర్‌ ప్రదీప్‌ మట్టి లోడ్‌ ఉన్న టిప్పర్‌ను అక్కడికి తెచ్చి, బ్రేక్‌ డౌన్‌ అయినట్టు నటించి నరేష్‌కు ఫోన్‌ చేశాడు. నరేష్‌ తన అల్లుడు సాయి ద్వారా ‘జాకీ పెట్టాలి.. రమ్మని’ అన్న వెంకటేష్‌ను పిలిపించాడు. టిప్పర్‌ ఇంజిన్‌ ఆన్‌లోనే ఉంది. నరేష్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్నాడు. అన్న వెంకటేష్‌ అక్కడికి వచ్చాక.. ‘జాకీ టైర్‌ కింద పెట్టి తిప్పు’ అని చెప్పాడు. వెంకటేష్‌ సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులో జాకీ తిప్పుతుండగా.. నరేష్‌ టిప్పర్‌ను ముందుకు పోనిచ్చాడు. భారీ వాహనం టైర్లు వెంకటేష్‌ శరీరంపై నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. అనంతరం డ్రైవర్‌ ప్రదీప్‌ను అక్కడి నుంచి పారిపోమ్మని చెప్పి రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశాడు.

ట్విస్ట్‌ ఇచ్చిన ‘అల్లుడి’ సాక్ష్యం
డ్రైవర్‌ ప్రదీప్‌ యాక్సిడెంట్‌ చేశాడని నరేష్‌ నాటకం ఆడాడు. కానీ, అక్కడే ఉన్న నరేష్‌ అల్లుడు ‘సాయి’ ఈ దారుణాన్ని కండ్లారా చూశాడు. టిప్పర్‌ నడిపింది డ్రైవర్‌ కాదని, తన మామ నరేష్‌ అని తండ్రి నర్సయ్యకు చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. నర్సయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నరేష్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయట పెట్టినట్టు సీపీ గౌష్‌ ఆలం తెలిపారు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి హత్య ప్లానింగ్‌ వీడియో ఉన్న మొబైల్‌ ఫోన్‌, ఇన్సూరెన్స్‌ బాండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌, ఎస్‌ఐ రాజు బృందం కేవలం మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -