కథా చందనం

Katha Chandanamకథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పాఠాలను కూడా కథల రూపంలో చెప్పడమంటే మరీ ఇష్టం.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెప్పడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. చెప్పడమే కాదు ఇప్పుడు ఏకంగా ఆ కథలపైనే పీహెచ్‌డీ చేశారు. ఆమే డా.సిరిసిల్ల చందన. తెలంగాణ నుండి హిందీ బాల సాహిత్యంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
మా సొంత ఊరు సిద్దిపేట. మా నాన్న మల్లేశం, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేసేవారు. అమ్మ సుజాత. చిన్నప్పుడు కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నాన్న చాలా పుస్తకాలు కొనిచ్చే వాడు. ప్రయాణాల్లో పుస్తకాలు చదివేలా మమ్మల్ని ప్రోత్సహిం చాడు. అలాగే నేను చదువుకుంది కంద్రీయ విద్యాలయంలో. అక్కడ కూడా లైబ్రరీ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడే హిందీపై ఆసక్తి పెరిగి బీఏ హిందీ చేశాను. అలాగే ఉస్మానియా యూనవిర్సిటీలో ఎం.ఎ హిందీ చేశాను. దక్షిణ భారత హిందీ ప్రచార సభలో పీజీ డిప్లొమా అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ అలాగే ”ఎన్‌. గోపి ననే ముక్తక్‌ అనువాద్‌ మూల్యాంకన్‌” అనే అంశంపై ఎం.ఫిల్‌ చేశాను.
హిందీపై ఆసక్తితో…
2002లో గజ్వేల్‌ ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా జాబ్‌ వచ్చింది. టీచర్‌గా పిల్లలకు కథలు బాగా చెప్పేదాన్ని. హిందీలోనే మాట్లాడమని ప్రోత్సహించేదాన్ని. ప్రతి దాంట్లో పిల్లల్ని భాగస్వాము లను చేసేదాన్ని. అలాగే హిందీకి సంబంధించి ఎక్కడ కాంపిటీషన్స్‌ జరుగుతున్నా వారు అందులో పాల్గొనేలా చూసేదాన్ని. మా వారు డా.పత్తిపాక మోహన్‌, ఎన్‌బిటీలో చేస్తారు. దాంతో కరోనా సమయంలో పిల్లల పుస్తకాలు చాలా చదివాను. ఆ ప్రభావం కూడా నాపై పడింది. ఆ ఆసక్తితోనే హిందీలో బాల సాహిత్యపై పీహెచ్‌డీ చేద్దామనుకున్నాను. మన తెలంగాణలో హిందీ బాలసాహిత్యంపై ఇప్పటి వరకు పీహెచ్‌డీ ఎవ్వరూ చేయలేదు. దాంతో పుస్తకాలు చాలా తక్కువ దొరికాయి. ‘హిందీ బాల్‌ సాహిత్యు: రాష్ట్రీయ పుస్తక న్యాస్‌కి సందర్భ్‌ మే’ అంశం పైన ఉస్మానియా యూనివర్సిటీలోని హిందీ ఓరియంటల్‌ విభాగంలో డా.శ్యామ్‌ సుందర్‌ పర్యవేక్షణలో ఆగస్ట్‌ 2023న పీహెచ్‌డి పూర్తి చేశాను. మా పిల్లలు అభ్యుదరు శంకర్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అనిరుధ్‌ శంకర్‌ తొమ్మిదవ తరగతి. ఈ వయసులో పీహెచ్‌డి పూర్తి చేసినందుకు మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం టెక్నికల్‌ విభాగంలో డిప్యుటేషన్‌ పైన పని చేస్తున్నాను.
సంపాదకురాలిగా…
యూనివర్సిటీతో పాటు ఇతర సంస్థలు నిర్వహించిన అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పత్ర సమర్పణలు చేశాను. హిందీ నుండి తెలుగు, తెలుగు నుండి హిందీలోకి ఎన్నో కథలు, బాల సాహిత్యాన్ని అనువాదం చేశాను. ‘సచిత్ర మలేరియా’ పుస్తకాన్ని డా.పత్తిపాక మోహన్‌తో కలిసి తెలుగులోకి తెచ్చాను. దీనిని నేషనల్‌ మలేరియా మిషన్‌, న్యూ ఢిల్లీ ప్రచురించింది. 2001లో గ్రూప్‌ 1 విద్యార్థుల కోసం గంగ పబ్లికేషన్స్‌ తెచ్చిన ‘మనకవులు’ పుస్తకానికి సంపాదకురాలిగా ఉన్నాను. అంతే కాకుండా హిందీలోకి వచ్చిన తెలుగు పిల్లల కథల పుస్తకాలకు సంపాదకత్వం వహించాను.
స్టోరీ టెల్లర్‌గా…
సాటర్‌డే ఫన్‌డే పేరుతో పిల్లలకు కథా సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాను. దీనితో స్టోరీ టెల్లర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో ఆకాశవాణిలో నేను చదివిన హిందీ కథలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అయ్యాయి. తెలంగాణ బడి పిల్లల కోసం కొవిడ్‌ సమయంలో టీ శాట్‌ కోసం 25 డిజిటల్‌ హిందీ పాఠాలు తయారు చేశాను. అవి ఇప్పటికీ ప్రసారమవుతున్నాయి. చీజజు=ు నిర్వహించిన అనేక కార్యశాలలు, సదస్సుల్లో ‘నేషనల్‌ రిసోర్స్‌ పర్సన్‌’గా పాల్గొన్నాను. రంగినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ వారు నిర్వహించిన పిల్లల కార్యశాలలో రిసోర్స్‌ పర్సన్‌గా ఉండి కథా రచనలో పిల్లలకు మెళుకువలు నేర్పారు. పిల్లల లోకం వంటి సంస్థలు నిర్వహించిన కార్యశాలల్లోనూ పాల్గొన్నాను.
హర్యానా ఉత్సవంలో…
ఖాళీగా ఉండడం మొదటి నుండి నాకు నచ్చదు. ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటాను. గజ్వేల్‌ పాఠశాలలో ఉన్నప్పుడు ‘ఎక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా హర్యానా రాష్ట్రంతో కలిసి చేసిన కార్యక్రమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా గజ్వేల్‌ కార్యక్రమాన్ని ట్వీట్‌ చేయడంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా హర్యానా సొన్‌ పథ్‌ పాఠశాలకు వెళ్లి అక్కడి ‘తెలంగాణ – హర్యానా’ ఉత్సవంలో పాల్గొ న్నాను. ఉపాధ్యాయుల శిక్షణలో కూడా ప్రత్యేకంగా డిజిటల్‌ కాంటెంట్‌, డిజిటల్‌ లెసన్స్‌ బోధన విషయంలో ఎక్కువ శ్రద్ద వహిస్తున్నాను.
పుస్తకాలు అందుబాటులో ఉంటే…
చాలా మంది ఇప్పటి పిల్లలు పుస్తకాలు చదవడం లేదు అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే పిల్లలకు పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయా లేదా అనేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొన్ని పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేసింది. అలా పిల్లలకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. అలాగే పిల్లలు వాటిని చదివేలా టీచర్లు ప్రోత్సహించాలి. అప్పుడు పిల్లలు పుస్తకాలు ఇష్టంగా చదువుతారు. పిల్లలు సాధారణంగా వాళ్ళ పుట్టిన రోజులకు చాక్లెట్లు పంచుతుంటారు. కానీ నేను మా స్కూల్‌ పిల్లలతో చాక్లెట్లు కాకుండా స్కూల్‌ లైబ్రేరీకి వారి పేరుతో పుస్తకాలు డొనేట్‌ చేయిస్తున్నాను. అలా ఇప్పుడు చాలా మంది పిల్లలు పుస్తకాలు ఇస్తున్నారు. ఇలాంటివి పిల్లల్లో పఠనాసక్తిని పెంచుతాయి.

ఒక ఛాలెంజ్‌ లాంటిది
పిల్లల్ని చదువువైపు మళ్ళించడం, వారు ఇష్టంగా చదివేటట్టు చేయడం ఒక ఛాలెంజింగ్‌ లాంటిది. ఇప్పుడున్న పరిస్థి తుల్లో పాత పద్దతుల్లో పుస్తకాలు చూసి చెప్పడం, ఏదో చెప్పుకుంటూ పోతే కుదరదు. ఎప్పటికప్పుడు పిల్లల్ని మోటి వేట్‌ చేయాలి. పిల్లల్లో కమ్యూని కేషన్‌ స్కిల్స్‌ పెంచాలి, వారిపై వారికి నమ్మకం పెంచాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు పదో తరగతి తర్వాత బయటకు వెళ్ళి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా పిల్లల్ని అన్ని విధాల సిద్ధం చేయాలి. అందుకే నేను మా స్కూల్లో ని పదో తరగతి పిల్లలకు వీటిపై అవగాహనా తరగతులు నిర్వహిస్తుంటాను.
– సలీమ

Spread the love