నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతోపాటు మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను కల్వకుంట్ల కవితతోపాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వైపులా తోపులాట చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవితతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇది సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వానికి కీలకమని కామెంట్ చేశారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల జీతాల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను ఆపాలని.. దీంతో కార్మికులపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని ప్రతి కాంట్రాక్ట్‌లో 25 శాతం అవినీతి జరుగుతోందని, 10 శాతం వాటా కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.



